సిద్దిపేట, మే 3: సిద్దిపేట ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి విచక్షణ కోల్పోయి మాట్లాడారని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని హరీశ్‌రావు నివాసంలో బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరామ్, మారెడ్డి రవీందర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది, అభివృద్ధిలో మొదటి వరుసలో నిలిపారన్నారు. కేసీఆర్ పోరాటం వల్ల వచ్చిన తెలంగాణకు రేవంత్‌రెడ్డి శనిలా పట్టాడని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ యూనివర్సిటీని కొడంగల్‌కు తరలించుకుపోయిన రేవంత్‌కు సిద్దిపేటలో ఓటు అడిగే హకు లేదన్నారు. సీఎం హోదాలో ప్రచారానికి వచ్చిన రేవంత్‌రెడ్డి సిద్దిపేట అభివృద్ధికి ఏం చేస్తాడో చెప్పకుండా కేసీఆర్, హరీశ్‌రావులను తిట్టడానికి వచ్చాడా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అబద్ధం అని చెప్పిన రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించాలని అధికారులు ఆదేశించడం దేనికి నిదర్శనమన్నారు. సిద్ధిపేట అభివృద్ధి కేసీఆర్, హరీశ్‌రావు హయాంలో జరిగిందన్నారు. రైతు రుణమాఫీపై గన్పార్ వద్దకు రాజీనామాతో హరీశ్‌రావు వస్తే రేవంత్ వెన్నుచూపి పారిపోయాడన్నారు. కాంగ్రెస్ పాలనలో తిట్లు, ఓట్లు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సిద్దిపేట ఉద్యమ గడ్డ అని, ఇకడి బిడ్డలకు ఉద్యమాలు చేయడం కొత్త కాదన్నారు. రాజీనామాలు బీఆర్ఎస్కు కొత్త కాదని, ప్రజలు అడిగిన ప్రతిసారి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్నారు. సినిమా డైలాగులు కొట్టుడు కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, హరీశ్‌రావులను ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రైతుల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ చేశాడని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడారని, సీఎం హోదాలో హుందాగా మాట్లాడాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి మేరుగు మహేశ్, మహిపాల్‌గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.