సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దుబ్బాక/దుబ్బాక టౌన్/మిరుదొడ్డి/రాయపోల్/ తొగుట, నవంబర్ 26: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉద్యమ గడ్డ దుబ్బాకలో జోష్ నింపారు. దుబ్బాకలోని దుంపలపల్లి రోడ్డులో నిర్వహించిన నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు హాజరై తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. 25 నిమిషాల పాటు ప్రసంగించి ప్రజల్లో ఫుల్‌జోష్‌ను నింపారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్యాయం, అనుభవించిన కష్టాలను కండ్లకు కట్టినట్లు వివరించారు. స్వరాష్ట్రంలో సాధించిన విజయాలను సవివరంగా చెప్పారు. నాడు తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో అనే విధంగా ఉద్యమం నడిచిందని అనడంతో యువకుల కేరింతలతో సభ మార్మోగింది.
రైతుబంధు కావాలా?… వద్దా? అనడంతో ఉండాలంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. 24 గంటల కరెంట్ కావాలంటే అందరూ చేతులెత్తి మద్దతు ప్రకటించారు. దుబ్బాక అంటే ప్రేమ అని, దుబ్బాకను అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనది అని… కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించే బాధ్యత మీదని… సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ప్రజలంతా గులాబీ కండువాలను గాల్లోకి ఊపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజేశారు. అందరి భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటేనని, విచక్షణతో ఓటు వేయాలని, ఆగం కావద్దని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఎందుకు ఓటువేయాలో సీఎం కేసీఆర్ వివరించారు.
బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుబ్బాకలో జనం నీరాజనం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వేలాది మంది తరలివచ్చి సభను విజయవంతం చేశారు. సభకు వెళ్లే దారులు ఎటు చూసినా జనమే కనిపించారు. అన్నివైపులా రోడ్లు ట్రాఫిక్‌జామ్ అయ్యాయి. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా గులాబీ కండువాలు కప్పుకొని వచ్చిన జనంతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. కళాకారుడు ఏపూరి సోమన్న పాటలు సభలో ఉర్రూతలూగించాయి.
అదే సమయంలో హెలిక్యాప్టర్‌లో వస్తున్న సీఎం కేసీఆర్‌ను చూసి ప్రజలు కేరింతలు కొట్టారు. సాయంత్రం 5.05 గంటలకు సీఎం కేసీఆర్ సభా వేదిక పైకి రాగానే ఈలలు, చప్పట్లతో ప్రజలు స్వాగతం పలికారు. సీఎం ప్రసంగం ఆద్యంతం ‘జై కేసీఆర్’, ‘జై జై కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక అంశాలను ప్రస్తావించిన ప్రతిసారి ప్రజల నుంచి సీఎం కేసీఆర్‌కు మద్దతు లభించింది. దుబ్బాక ప్రజాఆశీర్వాద సభకు పెద్ద సంఖ్యలో జనం రావడం… సీఎం కేసీఆర్ ప్రసంగం గులాబీ కార్యకర్తలో జోష్ నింపింది. సభ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో ఇదే బీఆర్ఎస్ బలం..బలగం అంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.