చిన్నశంకరంపేట, అక్టోబర్ 29: మెదక్ నియోజకవర్గ ప్రజలకు మైనంపల్లి హన్మంతరావు ఏం చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని సూరారం, భాగీర్థిపల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూరారం, భాగీర్థిపల్లి గ్రామాల్లో బోనాలు, డప్పుచప్పుల్లతో పటాకులు కాలుస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెంటు తిప్పలు తప్పవని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, మూడవ సారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, రైతుల సంక్షేమం కోసం రైతు బీమా, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబీమా, రైతుబంధు వంటి పలు సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్న మరోసారి ఆశీర్వదించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ నేతలకు ప్రజలు గుర్తుకువస్తారని, గత పదేళ్ల నుంచి నియోజకవర్గ ప్రజలకు దూరం ఉండి ఎన్నికల ముందు వచ్చి మైనంపల్లి హన్మంతరావు ఓట్లు అడుగుతే ప్రజలు ఎలా వేస్తారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన 200మంది యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన మహిళలకు, యువకులకు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, మాజీ జడ్పీటీసీ రమణ, సర్పంచులు, నీరజ, లక్ష్మణ్ దయానంద్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీటీసీలు అనురాధ, యాదగిరి, మాజీ సర్పంచ్‌లు చిలుక నాగరాజు, లక్ష్మణ్కుమార్గౌడ్, పవన్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ హేమ వెంకటేశం, హేమచంద్రం, దుర్గపతి, సుధాకర్‌నాయక్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేగుంట, అక్టోబర్ 29: ఇది మల్కాజిగిరి కాదు, ప్రశాంతంగా ఉన్న మెదక్ పల్లెలో గొడవలు సృష్టిస్తే ఊరుకునేది లేదని, ఎవరూ భయపడొద్దని, మీకు నేను అండగా ఉంటానని, దాడులు చేసిన వారిపై చట్టపరంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నార్సింగి మండల పరిధిలోని జెప్తిశివునూర్, ఎస్సీ కాలనీ కాశ్యతండా, సరోజినీ నగర్, సంకాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైనంపల్లి వర్గీయులు కాశ్యతండాలో బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన విషయం తెలుసుకుని అసహనం వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి గొడవలు లేవని, ఇలా గొడవలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. చట్ట పరంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.