జహీరాబాద్, ఏప్రిల్ 29: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో జహీరాబాద్ పట్టణంలో బ్రిడ్జి కమ్ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. జహీరాబాద్ పట్టణం నుంచి భరత్‌నగర్ గుండా అల్గోల్ బైపాస్కు వెళ్లేదారిలోని వాగును తలపించేలా మురుగు ప్రవహిస్తున్నది. నిత్యం జహీరాబాద్‌లోని పలు వార్డుల నుంచి వచ్చే మురుగు దీనిగుండా ప్రవహిస్తుంది. వర్షాకాలంలో మురుగుతోపాటు వర్షం నీటితో వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి.
ఈ రోడ్డు గుండానే పట్టణసమీపంలోని భరత్‌నగర్, అల్లా నా ఫ్యాక్టరీ, అల్గోల్, పోట్పల్లి, ఎల్గోయి తదితర గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డు గుండానే బీదర్, హైదరాబాద్ తదితర ప్రాం తాలకు వాహన రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ సమస్య పరిష్కారానికి మూడేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి కమ్ రోడ్టు నిర్మాణానికి రూ.33 లక్షల నిధులు మంజూరు చేసింది. అప్ప ట్లో టెండర్లు పూర్తికాగానే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు.
ఆ తర్వాత బిల్లుల చెల్లింపులో జాప్యంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలో ఆపేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనుల్లో పురోగతి కరువైంది. ఆ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఆర్అండ్బీ అధికారులు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయించారు. కానీ, బీటీ రోడ్డు పనులు పూర్తిచేయించ లేదు. గత వర్షాకాలం ఈ రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
గుంతలు పడి అధ్వానంగా తయారైన రోడ్డుతో వాహనాలు అదుపుతప్పి అనేక మంది ప్రమాదాలకు గురయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రిడ్జికి ఇరువైపులా మొరం పోయించారు. కానీ, నెలలు గడుస్తున్నప్పటికీ బీటీ రోడ్డు పనులు మాత్రం చేపట్టడం లేదు. ఫలితంగా దుమ్మూ ధూళి, గంతలతో వాహనచోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో అధికారులు స్పందించి పనులు పూర్తిచేయించాలని వాహనచోదకులు, ప్రజలు కోరుతున్నారు.