రేపటి నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం
అమ్మవారికి కుంకుమార్చన
భారీగా తరలిరానున్న భక్తులు
జిల్లాలో ఘనంగా శ్రావణ మాసోత్సవాల నిర్వహణ
కోహీర్, జూలై 27: దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడంపేట రాచన్నస్వామి దేవాలయం జిల్లాలో ప్రసిద్ధిగాంచింది. ఏటా శ్రావణ మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి శ్రావణం ముగిసే వరకు ఆలయంలోని శివలింగానికి లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు. భద్రకాళీదేవికి భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించనున్నారు. శివుడి పేరున ఉన్న సహస్ర నామాలను జపిస్తూ లక్ష బిల్వార్చన కొనసాగనున్నది. అటవీ ప్రాంతంలోని మారెడు ఆకులు(త్రిదళ పత్రాలు)ను సేకరించి శివుడి పేరున అర్పించనున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా బడంపేట రాచన్నస్వామి దేవాలయంలో మాత్రమే లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేపడతారు. తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. భక్తుల కోర్కెలు తీర్చే రాచన్నస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందుతారు.
లక్ష బిల్వార్చనలో పాల్గొనాలి..
ఈనెల 29వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్నది. రాచన్నస్వామి దేవాలయంలో ఈసారి కూడా లక్ష బిల్వార్చన చేయిస్తాం. రూ.2,500 రుసుము చెల్లించే భక్తుల పేరున గోత్రనామాలతో పూజలు, రూ.1,100 చెల్లించే భక్తుల పేరున ప్రతీ సోమవారం పూజలు చేసి స్వామివారి శేష వస్ర్తాలు, ప్రసాదాలు అందజేస్తాం. అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకోవాలి.
– శివరుద్రప్ప, బడంపేట ఆలయ ఈవో
మహిమ ఉన్న దేవుడు..
బడంపేట రాచన్నస్వామి మహిమగల దేవుడు. మంచి మనస్సుతో ఏమి కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రావణమాసం అంతా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. చాలా ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. లక్ష బిల్వార్చన, కుంకుమార్చన చేసి స్వామివారి కృపను పొందుతారు. -శివానంద్, ఆలయ కార్యదర్శి