Nizampet : మెదక్ జిల్లాలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కాలువల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే భారీగా నీరు చేరడంతో నిజాంపేట మండలం బీబీపేట పెద్ద చెరువు(Bibipet Pedda Cheruvu)కు గండి పడింది. ఆ గండి నుంచి పెద్ద ప్రవాహంలా వచ్చిన వరద నీరు రాంపూర్, నస్కల్, నంద గోకుల్ గ్రామాలను చుట్టుముట్టింది.
ఫలితంగా ఆయా గ్రామాల్లోని వందలాది ఎకరాల్లోని పంట పొలాలు నీటముగినిగిపోయాయి. దాంతో, భారీగా నష్టం వాటిల్లే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద సూచనతో ముందస్తుగా ఈ మూడు గ్రామాలకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మెదక్ పట్టణాన్ని వరుణుడు వదలడం లేదు. ఓ దఫా కుంభవృష్టితో జనజీవనాన్ని స్తంభించజేసిన వాన.. రాత్రి 9 గంటలకు మళ్లీ మొదలైంది. ఈసారి కూడా భారీగా చినుకులు పడుతున్నాయి. రోడ్లన్నపీ జలమయం అయ్యాయి. ఇప్పటికే పలు కాలనీల్లోకి మోకాళ్లలోతున నిలిచిన నీరు నిలిచింది. చమన్ నుంచి బాలాజీ మఠం మార్గం వరకూ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీటితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి భారీ వర్షం పడుతున్నందున వరద నీరుతో తిప్పలు తప్పేలా లేవని అందోళన చెందుతున్నారు స్థానికులు.