ములుగు, జూలై 9: చిన్నపేగు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి అరుదైన అయోటిక్ శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసినట్లు ఆర్వీఎం మెడికల్ కళాశాల, దవాఖాన సీఈవో శ్రీనివాస్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధి లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం మెడికల్ కళాశాల, వైద్యశాలలో బుధవారం విలేకరుల సమావేశంలో శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలు సీఈవో వెల్లడించారు.
మహబూబాబాద్ జిల్లా పోగులపల్లికి చెందిన యాకయ్య(52) కొన్నేండ్ల్లుగా చిన్నపేగు, కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఎన్ని దవాఖానలు తిరిగినా అతనికి అనారోగ్య సమస్య పరిష్కారం కాలేదు. చికిత్సకు సుమారు రూ.10 లక్షల ఖర్చు అవుతుందని పలు దవాఖానల వైద్యులు చెప్పడంతో యాకయ్య చికిత్స చేయించుకోలేదు.
యాకయ్య ఆర్వీఎం దవాఖానలో చేరగా, వైద్యులు అతనికి వైద్య పరీక్షలు చేసి సమస్య గుర్తించారు. ఆర్వీఎం దవాఖాన కార్డియోథొరాసిక్ సర్జన్లు భరద్వాజ్, విశ్వనాథ్, లక్ష్మి, విజయ్‌మోహన్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కిశోర్ సుమారు 10 గంటల పాటు శ్రమించి యాకయ్యకు ఉచితంగా అయోటిక్ శస్త్రచికిత్స విజయవంతంగా చేసినట్లు ఆర్వీఎం సీఈవో శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్వీఎం యాజమాన్యానికి, వైద్యులు, సిబ్బందికి రోగి, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.