మెదక్, జూలై 27(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కొర్రీలు, లబ్ధిదారుల అనాసక్తి వెరసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్లో పురోగతి కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల్లను మంజూరు చేశారు. మొదట మండలానికి ఒక పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ గ్రామాల్లో నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. తర్వాత మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల్ల నిర్మాణంలోనూ జాప్యం కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా అధికారులు విభజించారు.
సొంత స్థలం ఉన్నవారికి ఎల్-1, సొంత స్థలం లేని వారిని ఎల్-2, ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3 కింద విభజించారు. ముందుగా సొంత స్థలం ఉన్న పేదలను ఎంపిక చేశారు. ఒక్కో ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. నాలుగు విడతల్లో లబ్ధిదారులకు రూ.5 లక్షలు చెల్లించనున్నది. కాగా,ఈ నిబంధనలతో చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులున్న ఉన్న ఫ్యామిలీకి 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టడం అసౌకర్యంగా ఉంటుందని ఆసక్తి చూపడం లేదు.
మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 9091 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 4839 ఇండ్లు గ్రౌండింగ్ కాగా, 496 ఇండ్లు బేస్మెంట్ లెవల్ పూర్తి చేసుకున్నాయి. 95 ఇండ్లు గోడల వరకు పూర్తి కాగా, కేవలం 24 ఇండ్లు మాత్రమే స్లాబ్ లెవల్ పూర్తయ్యాయి. మంజూరైన ఇండ్లలో కనీసం సగం కూడా గ్రౌండింగ్ కాకపోగా, అయిన వాటిలో బేస్మెంట్ స్థాయిలోనే ఆగిపోతున్నాయి. బేస్మెంట్ లెవల్ వరకు నిర్మించిన వారికి రూ.లక్ష చెల్లించగా, రూఫ్ లెవల్ పూర్తి చేస్తే రూ.1.25 లక్షలు, స్లాబ్ వేస్తే రూ.1.75 లక్షలు, పెయింటింగ్ పూర్తి చేసిన తర్వాత రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలను ప్రభుత్వం డబ్బులు చెల్లించనున్నది. పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణానికి ఈ డబ్బులు సరిపోవని లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ముందుకు రావడం లేదు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక కష్టాలు తప్పడం లేదు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్ర స్థాయిలో ట్రాక్టర్ యజమానులు లబ్ధిదారులను నిలువునా దోచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముందు ట్రిప్పునకు రూ.2500 నుంచి రూ.3,200 వరకు ధర ఉండగా, ప్రభు త్వ ప్రకటన అనంతరం రెట్టింపు స్థాయిలో ధర పలుకుతోంది. ప్రస్తుతం ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.4వేలకు సరఫరా చేస్తుండగా, సన్న ఇసుకకు రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులు అటు ఇసుక, ఇటు సిమెంట్, స్టీల్ ధరలతో ఆర్థిక భారంపడి ఇల్లు నిర్మించుకుంటామో లేదోనన్న సందేహంలో పడ్డారు.
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికే మం జూరు చేస్తాం. మంజూరైన తర్వాత ఇల్లు ప్రారంభించకపోతే ఆ ఇంటిని రద్దు చేస్తాం. జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల్లను గ్రౌండింగ్ అయ్యేలా చూస్తాం. ఇల్లు నిర్మించుకునే వారికి విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నాం. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇల్లు నిర్మించుకునేలా చూస్తున్నాం.
– మాణిక్యం, హౌసింగ్ పీడీ, మెదక్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు మెదక్ జిల్లాలో నత్తనడకన కొనసాగుతున్నాయి. ఒకవైపు పెరిగిన ధరలు, మరో వైపు వర్షాకాలం ప్రారంభం కావడంతో మంజూరైన ఇండ్లలో కనీసం సగం కూడా గ్రౌండింగ్ కాలేదు. కొందరు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తిచేసి మొదటి విడత ప్రభుత్వ సాయం పొందిన తర్వాత రూఫ్ లెవల్‌కు వెళ్లే పనులను పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఫలితంగా ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో పురోగతి కరువైంది. ధరలు మరింత రరిగితే ప్రభుత్వం అందించే సాయం సరిపోక, ఇండ్ల్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం మరో రెండు లక్షల సాయం అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.