చిన్న శంకరంపేట, జూన్ 10 : చిన్న శంకరంపేట మండల పరిధిలోని మారుమూల గ్రామమైన కామారం గిరిజన తండాలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. స్థానిక ప్రధానోపాధ్యాయురాలు విజయ, ఉపాధ్యాయురాలు కవిత ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బడి ఈడు పిల్లల్ని బడికి పంపించాలంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన విద్యను అందిస్తారన్నారు.
తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాల పంపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, రెండు జతల యూనిఫామ్స్, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి మూడు కోడిగుడ్లు, నాణ్యమైన ఉచిత విద్య, వెనుకబడిన విద్యార్థుల పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన, అర్హత గల ఉపాధ్యాయులచే విద్య బోధన చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.