తొగుట,జూలై 30 : భావిభారత పౌరులను తీర్చిదిద్దే అంగన్వాడీ కేంద్రాలు అవస్థల మధ్య కొనసాగుతున్నాయి. సొంతభవనాలు లేక అద్దెభవనాల్లో అరకొర వసతులతో కాలం వెళ్లదీస్తున్నాయి. శిథిలావస్థలో భవనాలు కొనసాగడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగుప్పిట్లో చిన్నారులు బిక్కు బిక్కుమంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్య, మాతాశిశురక్షణకు పెద్దపీట వేసి భారీగా నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నిధులు రాక, కనీస సౌకర్యాలు లేక నరక యాతన అనుభవిస్తున్నట్లు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె కూడా చెల్లించకపోవడంతో సొంత డబ్బులతో కిరాయి కట్టుకుంటున్నట్లు వాపోతున్నారు.సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని 17 గ్రామా ల్లో 32 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 12 సొంతభవనాలు, 13 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
కొన్ని భవనాల నిర్మాణాలు ఆగమేఘాల మీద ప్రారంభించినప్పటికీ పిల్లర్ల దశలోనే పనులు అసంతృప్తిగా నిలిచిపోయాయి. అవి గేదెలు, పందులకు అడ్డాగా మారాయి. కొన్ని కేంద్రాలు రేకుల షెడ్లు, పురాతన పెంకుటిండ్లలో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అంగన్వాడీ టీచర్లు, చిన్నారులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గర్భిణులు, బాలింతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి వసతి, సరైన మూత్రశాలలు లేక చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనాలు ఏక్షణంలోనైనా కూలేప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని కేంద్రాల్లో ఆయాలు కూడా లేక అంగన్వాడీ కార్యకర్తలపై పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వెంటనే ఖాళీ చేయాలని యజమానులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మండల కేంద్రానికి నాలుగు అంగన్వాడీ భవనాలు మం జూరు కాగా అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి స్థల పరిశీలనలోనే ఆగిపోయాయి. ఇప్పటి వరకు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
నిధులు లేక పనులు ఆగిపోయాయి
సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో అంగన్ వాడీ కేంద్రానికి రూ.8 లక్షలు మంజూరు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు రూ. 2లక్షలు ఇచ్చారు. భవనం పిల్లర్ల వరకు నిర్మించి పనులు నిలిపివేశాం.మిగతా నిధులు విడుదల చేస్తామని చెబుతున్నారు కానీ విడుదల చేయలేదు. స్లాబ్ పోసి వదిలేశాం. నిధులు వస్తే భవనాన్ని పూర్తి చేస్తాం.అధికారులను అడిగితే తమకు సంబంధం లేదన్నట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నిధులు కేటాయించాలి.
-కొమురయ్య , కాంట్రాక్టర్, సిద్దిపేట జిల్లా