పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 15 : తెలిసిన వ్యక్తులను నమ్మించి గొలుసుకట్టు స్కీం పేరుతో వారి నుంచి కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసి వ్యక్తి ఉడాయించాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో మోసపోయామని గుర్తించిన బాధితులు బుధవారం మీడియా ముందుకు వచ్చి గోడువెళ్లబోసుకోవడంతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో 20 ఏండ్లుగా నివాసం ఉంటున్న హేమకాంత్రెడ్డి ఏడేండ్లుగా వెస్టీజ్ అనే సంస్థలో చేరి వందల మందిని సభ్యులుగా చేర్పించాడు. కోట్లు సంపాదించాలనే ఆశతో గత సెప్టెంబర్లో తనను నమ్మిన సభ్యులకు భారీ ఆశలు చెప్పి శుభక్షేత్ర ప్రాజెక్ట్ పేరుతో ప్రారంభించిన కొత్త గొలుసుకట్టు స్కీంలో పెట్టుబడి పెట్టించాడు.
ఐదు లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.25వేల చొప్పున 42 నెలలు చెల్లించడంతో పాటు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని నాగలిగిద్ద గ్రామంలో 102 గజాల ప్లాటు ఇస్తానని నమ్మబలికాడు. రూ.5లక్షలు కట్టిన వారు మరొకరి చేత ఐదు లక్షలు కట్టిస్తే ప్రతి నెలా రూ.5వేల కమీషన్ ఇస్తానని చెప్పాడు. హేమకాంత్రెడ్డి తమతో కలిసి పని చేసిన వ్యక్తి కావడంతో నమ్మిన బాధితులు 32 మంది కోటి అరవై లక్షలు పెట్టుబడిగా పెట్టారు. రెండు, మూడు నెలలు ప్రతి నెలా కమీషన్ సజావుగా చెల్లించిన తర్వాత సాకులు చెబుతూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు.
పటాన్చెరులోని అతడి ఇంటికి వెళ్లి బాధితులు నిలదీయడంతో రెండు రోజుల్లో ఇవ్వాల్సిన కమీషన్ చెల్లిస్తానని చెప్పి మకాం మార్చేశాడు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు.పటాన్చెరు, కర్నూలు, నిజామాబాద్, పిట్లం, దౌల్తాబాద్, బా న్సువాడ, గద్వాల, అదోని, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి మొత్తం 130 మంది ఈ స్కీంలో పెట్టుబడి పెట్టి రూ.6.90 కోట్లు మోసపోయినట్లు బాధితులు తెలిపారు. హేమకాంత్రెడ్డి తెలిసిన వ్యక్తి కావడంతో పాటు ఇచ్చిన డబ్బులు గోల్డ్, సిమెంట్ ట్రేడింగ్లో పెట్టినట్లు చెప్పి నెలకు ఇవ్వాల్సిన కమీషన్ రెండు, మూడు నెలలు సజావుగా ఇవ్వడంతో నమ్మి మరికొంత మంది పెట్టుబడులు పెట్టారని బాధితులు చెప్పారు. తమను మోసం చేసిన వ్యక్తి నుంచి పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇప్పించి తమకు న్యాయం చేయాలని పభుత్వం, అధికారులను వేడుకొన్నారు. దీనిపై పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.