స్వరాష్ట్రంలో సర్కారు బడికి మంచి రోజులొచ్చాయి. పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులు సమకూరుతున్నాయి. సీఎం కేసీఆర్ సమోన్నత ఆలోచనలతో చదువులు చక్కబడుతున్నాయి. కేజీ టు పీజీ సంకల్పంతో విద్యావ్యస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఒక్కటొక్కటిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిరు పేదలు సైతం నాణ్యమైన విద్యను అభ్యసించే భాగ్యం కల్పించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కళావిహీనంగా ఉన్న పాఠశాలలకు కార్పొరేట్ సొబగులద్దారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పిస్తున్నారు. విద్యార్థులందరికీ యూనిఫాంలు, సన్నబువ్వ పెట్టిస్తున్నారు. వార్షిక పరీక్షల వేళ పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం, స్నాక్స్ ఇప్పించారు. పరాయి పాలనలో సగం చదువు అయిపోయిన తర్వాత విద్యార్థుల చేతికందిన పాఠ్యపుస్తకాలు స్వరాష్ట్రంలో బడి తెరుచుకున్న తొలిరోజే అందేలా చూస్తున్నారు. మరో అడుగు ముందుకేసి నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్ సైతం ఉచితంగా అందించడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గించే మార్గం చూపారు. ఇలా సీఎం కేసీఆర్ ఏలు‘బడి’లో ప్రభుత్వ విద్యాలయాలు సగర్వంగా తలెత్తుకొని మరో విద్యావత్సరానికి బాలబాలికలకు ఆహ్వానం పలుకుతున్నాయి.
మెదక్ మున్సిపాలిటీ, మే 14: ముఖ్యమంత్రి కేసీఆర్ ఏలుబడిలో సర్కారు బడులకు మంచి రోజులొచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాం అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం పెడుతున్నారు. అదే స్థాయిలో వచ్చే సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల పిల్లలకు వర్క్‌బుక్స్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్స్ ఉచితంగా అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజున పాఠ్య పుస్తకాలతోపాటే నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్ అందజేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Medak2
మెదక్ జిలాలో 90,022 మంది విద్యార్థులకు లబ్ధి…
ప్రభుత్వ నిర్ణయంతో మెదక్ జిలాల్లోని 1062 పాఠశాలల్లోని 90,022 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ఒక్కో విద్యార్థికి సబ్జెక్టుకు ఒకటి చొప్పున నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్ అందజేయనున్నారు. వీటిని బయట కొనుగోలు చేస్తే ఒక్కొక్కరికి సుమారు రూ.వెయ్యికి పైగా ఖర్చు అవుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ భారం తగ్గనుంది.
మనఊరు-మనబడితో కార్పొరేట్ సొబగులు…
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తూ ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
మెదక్ జిల్లాలో 705 బడులకు ట్యాబ్‌లు
సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని సమగ్రశిక్షా పోర్టల్‌లో పొందుపర్చేందుకు ట్యాబ్‌లు వినియోగించనున్నారు. గతంలో సెల్ ఫోన్ల సహాయంతో సమాచారాన్ని ఆన్లైన్ చేసేవారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. ఈ హాజరును కచ్చితంగా తెలుసుకునేందుకు ఫేస్ రికగ్నైజేషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమలు చేయనున్నారు. 10 నుంచి 165 మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఒక ట్యాబ్ ఇస్తారు. విద్యార్థుల సంఖ్య 165 కన్నా ఎక్కువగా ఉంటే అదనంగా మరో ట్యాబ్ ఇవ్వనున్నారు. త్వరలోనే ప్రధానోపాధ్యాయులకు ట్యాబ్‌లను అందజేసేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచే…
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నది. నిత్యం ఫిజికల్ అడెండెన్స్ రిజిస్ట్రర్‌లో చోటు చేసుకుంటున్న అవకతవకలను నివారించడానికి ఉపాధ్యాయులు ఇకపై పాఠశాల తరగతి గది నుంచే విద్యార్థులు హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడానికి ముందే ఉపాధ్యాయుల ఫొటోలను సెల్ఫీ ద్వారా తీసుకొని యాప్‌లో అప్లోడ్ చేసి వారి ఐడీ నంబర్ విధులు నిర్వహిస్తున్న పాఠశాల, దాని యూడైస్ కోడ్ నంబర్ తదితర వివరాలన్నింటినీ నమోదు చేయాలి. విద్యార్థులు ప్రవేశాలు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, పాఠశాలలో మౌలిక సదుపాయాల ఫొటోలు, ఉపాధ్యాయుల నివేదికలు, విద్యార్థుల ఫొటోలను సైతం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చైల్డ్ ఇన్ఫో సమాచారం ట్యాబ్‌ల ద్వారా ఆన్లైన్ చేసేందుకు యూజర్ ఐడీ, లాగిన్ పాస్వర్డ్ రీసెట్ చేసే అవకాశం కల్పించనున్నారు.
జిల్లాలో 705 పాఠశాలలకు 727 ట్యాబ్‌లు…
మొదటి విడతగా మెదక్ జిల్లాలోని 577 ప్రాథమిక పాఠశాలలకు 591 ట్యాబ్‌లు, 128 ప్రాథమికోన్నత పాఠశాలలకు 136 ట్యాబ్‌లు అందజేయనున్నారు. జిల్లాకు వచ్చిన ట్యాబ్‌లను విద్యాశాఖ కార్యాలయంలో భద్రపర్చారు. ఇవి అందుబాటులోకి వస్తే ఉపాధ్యాయులకు సైతం ఇబ్బందులు దూరం కానున్నాయి. పాఠశాల విద్యార్థుల వివరాలను సమగ్ర శిక్షా పోర్టల్‌లో సులువుగా పొందపరిచేందుకు ఆస్కారం ఉంటుంది.
జిల్లాకు చేరుకున్న 2,57,872 పాఠ్యపుస్తకాలు
సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఉమ్మడి పాలనలో విద్యార్థులు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతుంది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎప్పటికప్పడు చర్యలు చేపడుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో మొత్తం 1062 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 637 ప్రాథమిక పాఠశాలలు, 183 ప్రాథమికోన్నత పాఠశాలలు, 242 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 90,022 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి 6,94,448 పుస్తకాలు అవసరం ఉన్నాయి. గత సంవత్సరం విద్యార్థులకు పంపిణీ చేయగా 2,29,480 పుస్తకాలు మిగిలాయి. ప్రస్తుతం విద్యార్థులందరికీ 6,71,500 పుస్తకాలు కావాల్సి ఉంది. నేటి వరకు జిల్లాకు 2,57,872 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 4,13,628 పుస్తకాలు రావాల్సి ఉంది. వచ్చిన పుస్తకాలను మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో గల గోదాంలో భద్రపరిచారు.
705 స్కూళ్లకు ట్యాబ్స్
ప్రభుత్వ పాఠశాలలకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కారు. రోజువారీ వివరాలు ఆన్లైన్ చేయడంలో తలెత్తుతున్న ఇబ్బందులను తొలిగించేందుకు, ఈ సిస్టమ్‌లో చోటుచేసుకుంటున్న అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతగా మెదక్ జిల్లాలోని 577 ప్రాథమిక పాఠశాలలకు 591 ట్యాబ్‌లు, 128 ప్రాథమికోన్నత పాఠశాలలకు 136 ట్యాబ్‌లు అందజేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ట్యాబ్‌లను డీఈవో ఆఫీసులో భద్రపరిచారు.
కొత్త పుస్తకాలొచ్చేశాయ్..
ఉమ్మడి పాలనలో విద్యార్థులు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా బీఆర్ఎస్ సర్కారు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త పాఠ్యపుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీంట్లోభాగంగా ఇప్పటికే జిల్లాకు 2,57,872 పాఠ్యపుస్తకాలను చేరవేసింది. వీటిని జిల్లాకేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ గోదాంలో భద్రపరిచారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే విద్య, క్రీడలకు అధిక నిధులు కేటాయించి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. ఈ ఏడాది వర్క్‌బుక్స్, నోట్‌బుక్స్ అందిస్తామనడం మంచి నిర్ణయం. దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యావకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
– సుంకరి కృష్ణ, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
సర్కారు నిర్ణయం సంతోషకరం..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి బడులు తెరవగానే పుస్తకాలు, యూనిఫాంతోపాటు వర్క్‌బుక్స్, నోట్‌బుక్స్ ప్రభుత్వం అందజేయడా నికి ఏర్పాట్లు చేయడం అభినందనీయం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరికీ తెలియజేసి విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కృషి చేస్తా. కేసీఆర్ సర్కారు నిర్ణయం సంతోషకరంగా ఉంది.
– శోభ, ఎస్ఎంసీ చైర్పర్సన్, హైస్కూలు, మెదక్
పాఠశాలల వారీగా పంపిణీ…
జిల్లాకు వచ్చిన ట్యాబ్‌లు త్వరలోనే ప్రధానోపాధ్యాయులుకు పంపిణీ చేస్తాం. జిల్లాకు మొదటి విడతగా 721 ట్యాబ్‌లు వచ్చాయి. ట్యాబ్‌ల వినియోగంపై ఒక రోజు శిక్షణనిస్తాం. ట్యాబ్‌లో తరగతుల వారీగా విద్యార్థుల ఫొటోలతోపాటు వివరాలను పొందుపరుస్తాం. మధ్యాహ్న భోజన వివరాలు సైతం పక్కాగా ఉంటాయి. డిజిటల్ బోధనకు వీటిని ఉపయోగించుకోవచ్చు. జిల్లాకు ఇప్పటివరకు 2 లక్షలకు పైగా పుస్తకాలు చేరుకున్నాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో పుస్తకాలు రానున్నాయి. పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులుకు పుస్తకాలు అందజేస్తాం.
– రాధాకిషన్, డీఈవో, మెదక్