హుస్నాబాద్ టౌన్, మే 23: కష్టాలు… పేదరికం శాశ్వతం కాదు అనడానికి ఈ పరి‘శ్రామికుడి’ విజయ గాథే సాక్ష్యం. పాలేరుగా జీవితం ఆరంభించిన క్రమంలో తాను ఒక పెద్ద షోరూం పెట్టాలనే కలలను నిజం చేసుకున్నాడు. తనలోని నడవడికన చూసి ‘అరె నీతోనే ఏదైనా అవుతదిరా.. నువ్వు ఏదైనా చేస్తవురా… అది నాకు తెలుసు’… అని తండ్రి కొడముంజ మల్లయ్య చెప్పిన మాటలను కొడుకు మహేందర్ నిజం చేసి చూపించాడు.
పాలేరుగా జీవనం మొదలు పెట్టి..
హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన కొడముంజ మహేందర్‌ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు మల్లయ్య-రాజమ్మలకు ముగ్గురు సంతానం. పేద కుటుంబంలో ఇంటికి పెద్ద కొడుకైన మహేందర్ తండ్రి పడుతున్న కష్టాలను చూడలేక ఎనిమిదో తరగతిలోనే చదువు మానేశాడు. కొనుగోలు చేసిన పొలం డబ్బులు చెల్లించేందుకు తల్లిదండ్రులతో కలిసి మెట్పల్లి ప్రాంతంలో వ్యవసాయ పాలేరు పనులు చేస్తూ జీవనం సాగించాడు. చిన్న వయసులో వ్యవసాయ పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తండ్రితో ఈ పనులు చేయలేనని చెప్పాడు. వ్యవసాయం పనులు మానేసి నంగునూర్లోని తన బావ దేవులపల్లి రాజమౌళి దగ్గర వెల్డింగ్ వర్క్ నేర్చుకున్నాడు. అనంతరం కరీంనగర్‌లోని వర్క్‌షాపుల్లో వెల్డింగ్ వర్క్‌లో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నాడు. స్నేహితుడి ప్రోత్సాహంతో పదోతరగతి, ఐటీఐ చదవి రామగుండంలో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేశాడు. అనంతరం విదేశాల్లో పనిచేస్తే వేతనం ఎక్కువ దొరుకుతుందనే భావనతో ప్రయత్నం చేసి ఇబ్బందుల పాలయ్యాడు.
రూ.ఐదు వేల పెట్టుబడితో.. : విదేశాలకు వెళ్లి బాగా సంపాదించాలనే ఆశయానికి గండి పడినప్పటికీ వర్క్‌షాపు పెట్టాలనే ఆశను వదులుకోలేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఐదువేల రూపాయల పెట్టుబడితో భార్య స్వప్న సహకారంతో హుస్నాబాద్‌లో 2009లో చిన్న పరిశ్రమ ప్రారంచి తన కలకు శ్రీకారం చుట్టాడు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పనిముట్లను తయారు చేస్తూ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. అలా స్థానికంగానే రోటోవేటర్, కేజ్‌వీల్స్, డోజర్, ఫ్లవ్, కల్టివేటర్, సీడ్డ్రమ్, ట్యాంకర్, ట్రాక్టర్ టేలర్స్ తదితర యంత్రాలు, పరికరాలు తయారు చేశారు.
అరెబుల్ రోటోవేటరీ కంపెనీకి శ్రీకారం.. : స్వరాష్ట్రం సిద్ధించిన తరుణంలో ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. అందుకు అనుగుణంగా వ్యవసాయ పనిముట్ల తయారీ వ్యవస్థ స్థానికంగా లేదు. దీంతో వివిధ రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని మార్చాలనే ఆలోచనలకు కొడముంజ మహేందర్ బీజం వేశారు. హైదరాబాద్‌లో వ్యవసాయ పనిముట్లను తయారుచేసే వ్యాపారంలో రాణిస్తున్న తాను తాజాగా అరెబుల్ రోటోవేటరీ కంపెనీని సైతం ప్రారంభించారు. పలు జిల్లాల్లో డీలర్లను సైతం నియమించి కంపెనీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. ఇద్దరు ఇంజినీర్లతోపాటు పలువురికి ఉపాధినిచ్చే పారిశ్రామికవేత్తగా మహేందర్ ఎదిగారు. ఒకనాడు రూ.ఐదువేల పెట్టుబడితో ప్రారంభమైన వ్యాపారం నేడు ఐదునర్నకోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరిందంటే తనకు నమ్మశక్యంగా లేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు మహేందర్.
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం.. : హుస్నాబాద్‌లో కొడముంజ మహేందర్ ఆరంభించిన అరెబుల్ రోటోవేటర్ల తయారీ పరిశ్రమను పురపాలక శాఖా మంత్రి కేటీఆర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఈ నెల 5వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ ఆలోచనలకు మరింత వెనుదన్నుగా నిలిచేందుకు 10 ఎకరాల భూమిని సైతం ఇప్పించి వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్ల పరిశ్రమను స్థానికంగానే ఇప్పించాలని మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్‌కు స్వయంగా సూచించారు.
విదేశాలకు ఎగుమతి చేస్తా..
నేను పుట్టిన ఈ ప్రాంతం నుంచి ఇక్కడ తయారు చేసిన పనిముట్లను అన్ని రాష్ర్టాలు, దేశాలకు ఎగుమతి చేయాలనేది నా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ సార్‌కు చెబితే వెరీగుడ్ అంటూ నన్ను ప్రోత్సహించడం నాలోపల మరింత పట్టుదలను పెంచింది. ఈ స్థాయి రావడానికి నా తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి, నా భార్య సహకారం మరువలేనిది.
-కొడముంజ మహేందర్, వ్యాపారి