నిజాంపేట్, మే 9: రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని జంబికుంట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిధిలోని జంబికుం ట గ్రామానికి వెళ్లే రహదారి ఎన్హెచ్ 161 కు కిలోమీటర్ ఉంటుంది. గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలను 2019లో బీఆర్ఎస్ హయాంలో జంబికుం ట మాజీసర్పంచ్ మామిడి సాయమ్మ నాటించారు.
అవి ఇప్పుడు పెరిగి వృక్షాలుగా మారి రహదారి నుంచి వెళ్లే వారికి నీడనిస్తున్నాయి. అంతేకాకుండా రహదారి నిండుగా, అం దంగా కనిపిస్తూ అటుగా వెళ్లే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కరెంట్ తీగలకు అడ్డు వస్తున్నాయని విద్యుత్ అధికారులు జేసీబీతో చెట్లను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
హత్నూర, మే 9: పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలే, వర్షాలు సమృద్ధిగా కురవాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటించింది. ఆనాడు నాటిన మొక్కలు నేడు ఎక్కడ చూసినా ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గ్రామాలు, పొలంగట్లు, ఖాళీ స్థలాలు, రోడ్లపక్కన మొక్కలునాటి సంరక్షించారు. ఆ మొక్కలు వృక్షాలుగా మారి సత్ఫలితాలు ఇస్తున్నాయి. రెండేండ్ల క్రితం హత్నూర మండలం నాగులదేవులపల్లి బస్ స్టేజీ నుంచి గ్రామం వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించి సంరక్షించడంతో ఏపుగా పెరుగుతున్నాయి.
విద్యుత్ తీగలకు అడ్డుగా మారుతున్నాయనే సాకుతో విద్యుత్ సిబ్బంది చెట్లను ఎక్కడికక్కడ నరికివేశారు. చిన్నచిన్న మొక్కల నుంచి ఏపుగా పెరిగిన చెట్ల వరకు నరికి రోడ్డుపక్కన పడేశారు. విద్యుత్ తీగలకు తగిలేంత పెద్దగా పెరగనప్పటికీ చిన్న మొక్కలను సైతం సగం వరకు నరికి వదిలేశారు. విద్యుత్ సిబ్బంది తీరుతో పచ్చనిచెట్లు నేలమట్టం అయ్యాయని గ్రామస్తులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.