సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్య మ స్ఫూర్తిని ఎంతో మందికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని అహర్నిశలు శ్రమించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడేందుకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ఊపిరి, మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా ఆయన నిలబడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మజారాణి, కలెక్టరేట్ ఏవో పరమేశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తినింపిన పోరాటయోధుడు, తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రమాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తొలిదశ ఉద్యమానికి ఊపిరిగా.. మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా నిలబడ్డారని ఆయన సేవలను గుర్తు చేశారు. జయశంకర్ సార్ ఆశయ సాధనకు యువత ముందుకు సాగాలన్నారు. ఆ యన కన్న కలల బంగారు తెలంగాణ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రజానీకం ఎప్పటికీ జయశంకర్ త్యాగాన్ని మర్చిపోదన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 6