కంది, ఆగస్టు 2: సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక సోదాలతో అధికారులు, ఉద్యోగులకు గుబులు పుట్టించింది. గురువారం సా యంత్రం 6గంటల రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం 6గంటల వరకు సోదాలు చేపట్టారు. జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు అనుమానంతో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నా రు. అధికారుల రాకతో రూ. లక్ష నగదును కిటికీలోంచి బయట పడేశారు. ఈ నగదును బయట పారేసింది ఎవరు అన్న కోణంలో పూర్తి విచారణ చేపట్టినట్లు సమాచారం. గురువారం జరిగిన భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 56 డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. సోదాలకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఏసీబీ అధికారులు మీడియాకు తెలియపర్చలేదు.
ఏసీబీ అధికారుల తనిఖీలకు భయపడి ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మా రింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకూ కందిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న ఏ ఒక్క కౌంటర్ తెరుచుకోలేదు. రిజిస్ట్రేషన్లు జరగవనే ప్రచారం జరిగింది. ఈ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్యాకుమెంట్ను బట్టి బేరసారాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ రైటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తున్నది. నిత్యం రిజిస్ట్రేషన్దారులతో హడావిడిగా ఉండే డాక్యుమెంట్ రైట ర్ల షాపులు కూడా మూసిఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఏసీబీ అధికారుల సోదాలతో శుక్రవారం కార్యాలయం జనం లేక వెలవెలబోయింది. సెంటిమెంట్ దినం కావడంతో ప్రతి శుక్రవారం రిజిస్ట్రేన్లతో కార్యాలయం కిక్కిరిసిపోయేది. కానీ, ఈ శుక్రవారం భూ వ్యాపారులు, రిజిస్ట్రేషన్దారులు లేక కార్యాలయం, కార్యాలయ ఆవరణ బోసిపోయింది.