జహీరాబాద్, అక్టోబర్ 19 : తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్‌పోస్టు అవినీతికి నిలయంగా మారింది. ఆర్టీఏ చెక్‌పోస్టులో కొందరు అధికారులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని భారీ వాహనాల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన డబ్బులు పక్కదారి మళ్లించి జేబులు నింపుకొంటున్నారు. ఇదంతా ఎవరో ఊహించి చెబుతున్నది కాదు ఏసీబీ అధికారులు శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్టుపై దాడి చేయడంతో అవినీతి భాగోతం బయటపడింది.
ఇటీవల ఆంతర్రాష్ట్ర సరిహద్దులోని మాడ్గి ఆర్టీఏ చెక్‌పోస్టును ఎత్తివేశారు. దానిస్థానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై రవాణా పర్మిట్లు, ఇతర అనుమతులన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ముంబయి-హైదరాబాద్ 65వ జాతీయ రహదారి మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాన్స్‌పోర్టు వెబ్‌సైట్‌పై ఆర్టీఏ అధికారులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో స్థానిక ఆర్టీఏ అధికారులు భలే చాన్స్ అనుకుని ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.
స్థానిక ఆర్టీఏ అధికారుల అక్రమాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికోడుతున్నది. డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ అనంద్‌కుమార్ ఆధ్వర్యంలో మాడ్గి ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో చెక్‌పోస్టు వద్ద అక్రమంగా వాహనదారుల నుంచి వసూలు చేసిన రూ. 42,300 నగదను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు చేస్తున్న సమయంలో ఎంవీఐ కిరణ్‌కుమార్‌తో పాటు ఒక కానిస్టేబుల్, మరో ఇద్దరు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. ఎంవీఐ కిరణ్‌కుమార్ ప్రైవేటు వ్యక్తిని కారు డ్రైవర్‌గా నియమించుకుని వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఏసీబీ అధికారుల విచారణలో బయటపడింది. ఆర్టీఏ అధికారులు అక్రమ వసూళ్లు నిత్యం రూ.లక్షల్లో ఉంటున్నాయని తెలిసింది.
వసూలు చేసిన డబ్బులకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. ఆర్టీఏ చెక్‌పోస్టులో అధికారులు విధులు నిర్వహించే హాజరు రికార్డులు సరిగ్గా లేవని, ప్రతిరోజు అధికారులు, సిబ్బంది సంతకాలు పెట్టేందుకు 200 పేజీలతో కూడిన రిజిస్టర్‌ను పెట్టుకోవాల్సి ఉండగా, నెలకు సరిపడే చార్టును వినియోగిస్తున్నారని గుర్తించారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.