జహీరాబాద్, మార్చి 14: హోలీ పండుగ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి గ్రామ వాసులకు విషాదం మిగిల్చింది. హద్నూర్ పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం వడ్డి గ్రామ వాసి గాలప్ప, గాలమ్మ దంపతుల రెండో కుమారుడు శివకుమార్ (19) స్నేహితులతో కలిసి హోలీ ఆడాడు. హోలీ పండుగ తర్వాత స్నానం చేసేందుకు స్నేహితులతో కలిసి శంశోల్లాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి బావిలో స్నానం చేస్తుండగా శివకుమార్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న హద్నూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని శవాన్ని బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం గజ ఈతగాళ్లను రప్పించి బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు వెలికి తీస్తామని పోలీసులు చెప్పారు. శివకుమార్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో మృతుడు శివకుమార్ వెంట వెళ్లిన స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హద్నూర్ పోలీసులు పేర్కొన్నారు.