Sangareddy | మునిపల్లి, మర్చి 05 : మండల పరిధిలోని బుదేరా గ్రామ శివారులో గల ముంబై జాతీయ రహదారి పక్కన గల ప్రభుత్వ స్థలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విశ్రాంతి భవనం నిర్మించింది. ప్రభుత్వ విశ్రాంతి భవనం నిర్మాణం చేపట్టి విశ్రాంతి భవనంలోకి కావలసిన సామాగ్రి సైతం గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆందోల్ అప్పటి(మాజీ) ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంబంధిత అధికారులతో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో పలు అభివృద్ధి పనులపై పలుమార్లు సమావేశాలు సైతం నిర్వహించుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏడాది పాటు ప్రభుత్వ విశ్రాంతి భవనం వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నెత్తి చూడలేదు. ఇటీవల మండలంలోని బుదేరా మహిళ డిగ్రీ కళాశాలకు ప్రహరీ గొడ నిర్మించేందుకు చేపడుతున్న పనులు చేపట్టేందుకు పశ్చిమబెంగాల్ నుంచి సుమారు 30-35 మంది కూలీలను తీసుకువచ్చారు. ఇక అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. ప్రభుత్వ విశ్రాంతి భవనంలో అత్తగారింట్లో ఉంచినట్లు కూలీలను ఉంచడంపై మండల వాసులు సంబంధిత అధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ అతిథి గృహంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మండలంలోని కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను విశ్రాంతి భవనంలో ఉంచుతున్న వ్యక్తులపై ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మునిపల్లి మండల వాసులు ఉన్నత అధికారులను కోరుతున్నారు.
కూలీ పనులు చేసే వారికి ప్రభుత్వ విశ్రాంతి భవనంలో ఉంచడం ఏంటని మండల వాసులు అధికారుల తీరు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంత మీ రాజ్యమేనా ప్రభుత్వ విశ్రాంతి భవనం ఎందుకు నిర్మిస్తారో ఆ మాత్రం అధికారులకు తెలవదా..? తెలవకుండా ఎలా విధులు నిర్వహిస్తున్నారు అని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని ప్రభుత్వ విశ్రాంతి భవనం పేకాటకు అడ్డాగా మారింది.
మండల పరిధిలోని బుదేరాలోని ప్రభుత్వ భూమిలో అప్పటి ప్రభుత్వం రూ. 87లక్షలతో విశ్రాంతిభవనం నిర్మాణం చేపట్టి రూ. లక్షలు విలువ చేసే సామాగ్రి సైతం ఏర్పాటు చేశారు. కూలీలు విశ్రాంతిభవనంలో ఉంటే పూర్తిగా దెబ్బతింటుందని ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి విశ్రాంతిభవనంలో కూలీలను ఉంచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.