పటాన్చెరు, జూన్ 15: ముత్తంగి ఔటర్ రింగురోడ్డు పొదల్లో లభించిన ఎనిమిదేండ్ల చిన్నారి శవం కేసు మర్డర్‌గా తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న తల్లే కొడుకును కడతేర్చింది. పటాన్చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం…పటాన్చెరు మండలం ముత్తంగి పరిధిలోని ఔటర్ రింగ్‌రోడ్డు పొదల్లో ఈనెల 11న బాలుడి శవం కనిపించింది. పోలీసులు హత్యగా అనుమానించి గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడు పాత రామచంద్రాపురానికి చెందిన కర్రె విష్ణువర్ధన్ (8)గా గుర్తించారు. మృతుడు విష్ణువర్ధన్ తండ్రి కుమార్ మృతిచెందడంతో తల్లి కర్రె స్వాతి(30)వద్ద పెరుగుతున్నాడు.
స్వాతిది కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, పోల్కంపేట గ్రామం. పెండ్లి తర్వాత పాత రామచంద్రాపురంలో నివసిస్తున్నది. స్వాతి ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన అనిల్ (31)ను రెండో పెండ్లి చేసుకుంది. అనిల్ స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 10న విష్ణువర్ధన్ తల్లిని తిట్టడంతో తీవ్ర ఆగ్రహంతో ఆమె గొంతు నులిమి చంపింది. తర్వాత కంగారు పడి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కిటికీకి టవల్ కట్టి బాలుడు ఉరేసుకున్నట్టుగా వేలాడదీసింది. అనంతరం అనిల్‌ను ఫోన్‌చేసి పిలిపించి విష్ణువర్ధన్ ఉరివేసుకుని చనిపోయాడని నమ్మించింది.
స్వాతి గ్రామంలోని బంధువులకు ఫోన్‌చేసి విష్ణువర్ధన్ ఆత్మహత్యకు పాల్పడి చనిపోయినట్లుగా తెలిపింది. శవంతో ఊర్లోకి రావొద్దు బంధువులు అనడంతో ఏమి చేయాలో తెలియక అనిల్, స్వాతి అర్ధరాత్రి సమయంలో ముత్తంగి ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద సర్వీస్ రోడ్డు పొదల్లో విష్ణువర్ధన్ శవాన్ని పారవేసి పరారయ్యారు. ఈనెల 11న ఉదయం స్థానికులు మృతదేహాన్ని చూసి పటాన్చెరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని శవంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో బాలుడి శవం చిత్రం వైరల్ కావడంతో ఆ వివరాలు పాత రామచంద్రాపురం పట్టణంలో వెలుగు చూశాయి. ఈమేరకు కర్రె స్వాతిని, రెండో భర్త దొంతు అనిల్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తే కుమారుడిని హత్య చేసినట్లు స్వాతి ఒప్పుకున్నది. దీంతో అనిల్‌ను, స్వాతిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన పటాన్చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డిని, క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజును, క్రైమ్ పోలీసులకు డీఎస్పీ రవీందర్ అభినందించారు.