అమరావతి : గుంటూరు నవభారతనగర్‌లోని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) పై ఇంటిపై టీడీపీ శ్రేణులు ( TDP Cadre ) దాడులు చేశారు. ఇంటిలోని ఫర్నిచర్‌ను, కిటికి అద్దాలను ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ( Chandra Babu ) పై అసభ్య పదజాలంతో దూషించడంతో అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటిని నలువైపులా నుంచి ముట్టడించారు.
24 గంటల్లో అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవం ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు అంతు చూస్తానని అంబటి హెచ్చరించడంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చేసిన ఆరోపణపై విచారణ జరిపిన సీబీఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. దీంతో తిరుమల లడ్డూపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ వైసీపీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయాల వద్ద పాప ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించింది .
గుంటూరులో పోటాపోటిగా తిరుమల లడ్డూపై పోస్టర్లు వేశారు. టీడీపీ శ్రేణులు వేసిన ఫ్లెక్సీని తొలగిస్తానని సవాలు విసరడంతో పాటు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి అంబటి రాంబాబు గుంటూరులోని గోరంట్లకు కారులో వెళ్తుండగా మార్గమధ్యలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఒకరిద్దరూ టీడీపీ శ్రేణులు కారుపై చేతితో బాదారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా దాడి యత్నాన్ని ఆపలేకపోయారు.
చివరకు పోలీసు బందోబస్తు మధ్య అంబటిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మూకలు రాష్ట్రంలో అరచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా సీఎంపై అంబటి వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు జిల్లా ఎస్పీకి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.