Kevin Warsh : డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి అమెరికా అధ్యక్ష (US President) పదవిని చేపట్టినప్పటి నుంచి కీలక వడ్డీ రేట్లు తగ్గించాలని తమ కేంద్ర బ్యాంక్ (Centrel bank) అయిన ఫెడరల్ రిజర్వ్ (Federal reserve) కు చెబుతూ వస్తున్నారు. కానీ ఫెడ్ రిజర్వ్ ప్రస్తుత ఛైర్మన్ జెరోమ్ పావెల్ (Jerome Powell) అంతగా పట్టించుకోలేదు. ఈ ఏడాది మే నెలలో పావెల్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో కొత్త గవర్నర్‌గా కెవిన్ వార్ష్ (Kevin Warsh) ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే 2017లో పావెల్‌ను నామినేట్ చేసింది కూడా ట్రంపే కావడం గమనార్హం.
కెవిన్ వార్ష్ 2006-11 మధ్య ఫెడ్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఆయన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, అధిక వడ్డీ రేట్లకే మద్దతు ఇచ్చేవారు. తక్కువ వడ్డీ రేట్ల విధానాన్ని వ్యతిరేకించారు. 2008-09 మహా మాంద్యం సమయంలో ఫెడ్ విధానాలను ఆయన ఒప్పుకోలేదు. అప్పట్లో ఫెడ్ బోర్డు సభ్యుడిగా ఎంపికైన అతి తక్కువ వయసున్న (35) వ్యక్తిగా వార్ష్ నిలిచారు. ఇటీవలి కాలంలో తక్కువ వడ్డీ రేట్లకు మద్దతు పలకడం, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టాక ఆయన విధానాలకు వార్ష్ మద్దతివ్వడమే తాజా ఎంపికకు కారణంగా చెబుతున్నారు.
అయితే సెనేట్ కూడా సమర్థిస్తేనే ఫెడ్ ఛైర్‌గా వార్ష్ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా ట్రంప్ ప్రకారం అమెరికాలో కీలక రేట్లు 1% వద్ద ఉండాలి. ప్రస్తుత 3.5% ఆయన అంచనాకు చాలాదూరంగా ఉంది. అందుకే స్వతంత్ర సంస్థ అయిన ఫెడ్‌పై నియంత్రణ కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంచనా. అమెరికా ద్రవ్యోల్బణాన్ని తక్కువ స్థాయుల్లో ఉంచేందుకు, ఉద్యోగ నియామకాలకు మద్దతు పలకడంతోపాటు, బ్యాంకింగ్ నియంత్రణాధికార సంస్థగానూ ఫెడ్ వ్యవహరిస్తుంది. ఫెడ్ నిర్ణయాల వల్ల తనఖా, వాహన, క్రెడిట్ కార్డు వంటి అన్ని రుణాలపై ప్రభావం పడుతుంది.