చేర్యాల, మే 27: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఉప ఎన్నికలో 76.13 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన గ్రాడ్యుయేట్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. పట్టభద్రులు ఓటుహక్కును వినియోగించుకోవడంలో చైతన్యం చూపించారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూకట్టారు. పోలింగ్ సమయం 4గంటలకు ముగిసినప్పటికీ పట్టభద్రులు చేర్యాల, మద్దూరు పోలింగ్ కేంద్రాల్లో వేచి ఉన్నారు.

పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారందరికీ ఎన్నికల అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సిద్దిపేట జిల్లాలోని జనగామ నియోజకవర్గం పరిధిలో మొత్తం 4,679 మంది పట్టభద్రుల్లో పురుషులు 3,122, మహిళలు 1,557 మంది ఉన్నారు. ఇందుకు చేర్యాలలో రెండు పోలింగ్ కేంద్రాలు, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండల కేంద్రాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన పోలింగ్‌లో 2353 మంది పురుషులు, 1209 మంది మహిళలు మొత్తం 3,562 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగు మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో ఆయా సెంటర్లకు 100 మీటర్ల బయట రాజకీయ పార్టీల నాయకులు మోహరించి కేంద్రాలకు వచ్చే పట్టభద్రులను కలిసి తమ పార్టీ అభ్యర్ధికి ఓటు వేయాలని కోరారు. చేర్యాల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ సందర్శించి సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకోవడంతోపాటు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసి ఓటింగ్ ప్రక్రియ బీఆర్ఎస్ పార్టీకి గ్రాడ్యుయేట్స్ నుంచి వస్తున్న స్పందన తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి రాకేశ్‌రెడ్డి దంపతులు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు.

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలకేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు బారులుదీరారు. ఓటుహక్కును వినియోగించుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చి ఓటు వేశారు. ఉదయం 10 గంటలకు 11.03 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 33.19 శాతం, 2 గంటలకు 50.72 శాతం, సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 4 గంటల వరకు 69.82 శాతం నమోదైంది. చేర్యాల, మద్దూరులో పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూలో నిలబడిన వారికి ఓటుహక్కు కల్పించారు.
దీంతో పోలింగ్ శాతం 76.13 నమ్దైనట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా కొమురవెల్లి పోలింగ్ కేంద్రంలో 86.58 నమోదైంది. అత్యల్పంగా చేర్యాల(1) కేంద్రంలో 71.61 నమోదైంది. పోలింగ్‌లో పాల్గొనేందుకు పట్టభద్రులు సొంత వాహనాలు, బైక్‌లు, బస్సులు, ఆటోల్లో తరలివచ్చి క్యూలో ఉండి మరీ ఓట్లు వేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారులు పటిష్టమైన బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులో సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌కు తరలించారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య నల్లగొండ జిల్లా కేంద్రానికి తీసుకు పోయారు.

వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు చేర్యాల పట్టణానికి చెందిన దివ్యాంగురాలురాజేశ్వరి హైదరాబాద్ నుంచి చేర్యాలకు వచ్చింది. ఇంటి నుంచి కేంద్రానికి రిక్షాలో వచ్చి ఓటుహక్కు వినియోగించుకుంది. ఎన్నికల అధికారులు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడంతో దివ్యాంగులు, సీనియర్ గ్రాడ్యుయేట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
– చేర్యాల, మే 27