సిద్దిపేట, అక్టోబర్ 16( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈసారి మద్యం షాప్‌ల ఏర్పాటుకు ఆశించిన మేర దరఖాస్తులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది. గతంలో ఉన్న టెండర్ లైసెన్స్‌ల గడువు ముగియక ముందే నోటిఫికేషన్‌ను జారీచేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఎక్కువ దరఖాస్తులు వస్తే భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.కానీ, ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. గతంలో ఉన్న రూ.2 లక్షల టెండర్ ఫీజును ప్రస్తుతం రూ.3 లక్షల ఫీజుకు (నాన్ రీఫండబుల్ )పెంచింది.దీంతో వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. కాంగ్రెస్ పాలనలో అన్నిరంగాలు కుదేలై ఆర్థిక పరిస్థితి దిగజారింది. మార్కెట్లో డబ్బుల రొటేషన్ తగ్గాయి. ఈ ఎఫెక్ట్ మద్యం టెండర్లపైన ప్రభావం చూపింది.
అక్టోబర్ 1 నుంచి మద్యం టెండర్లకు దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. మొదటి రోజు నుంచి మందకొడిగానే దరఖాస్తులు వస్తున్నాయి.15,16 తేదీల్లో కొంచెం దరఖాస్తుల సంఖ్య పుంజుకుంది.గురువారం 16న దరఖాస్తులు బాగానే వచ్చా యి.ఈ ఒక్క రోజు సిద్దిపేటలో 300, మెదక్‌లో 161, సంగారెడ్డిలో486 వచ్చాయి.మిగిలిన ఈ రెండు రోజుల్లో ఎంతమేర దరఖాస్తు వస్తాయో చూడాల్సిందే. 16న సాయంత్రం వరకు సిద్దిపేట జిల్లాలో 93 వైన్స్‌లకు 561 దరఖాస్తులు, మెదక్ జిల్లాలో 49 వైన్స్‌లకు 454 దరఖాస్తులు,సంగారెడ్డి జిల్లాలో101 వైన్స్‌లకు 1264 దరఖాస్తులు వచ్చాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 243 వైన్స్‌లకు గురువారం సాయంత్రానికి 2279 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 వైన్స్‌లకు 12,227 దరఖాస్తులు వచ్చాయి. రూ. 244.54 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి కనించడం లేదు. గతేడాది వైన్స్ షాప్‌ల్లో అంతగా లాభాలు రాలేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈసారి టెండరు రుసుం పెంచడంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. పది మంది కలిసి ఒక గ్రూప్‌గా పదుల సంఖ్యలో మద్యం టెండర్లు వేసే వారు, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ పడిపోవడం కూడా వైన్స్‌ల టెండర్లకు దరఖాస్తులు తగ్గడం ఓ కారణంగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.