జహీరాబాద్, జూన్ 15: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత జిల్లా సంగారెడ్డిలో సర్కారు వైద్యం నీరుగారుతున్నది. ఏ దవాఖాన చూసినా వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మందులు, ఇతరత్రా సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. జహీరాబాద్‌లోని ఏరియా దవాఖాన పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఇక్కడ పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదు. వైద్యాధికారుల పోస్టుల భారీగా ఖాళీగా ఉన్నాయి. ఉన్న వైద్యాధికారులు సమయానికి రాకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
జహీరాబాద్ 100 పడకల దవాఖానలో 56 మంది వైద్యులకు కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. 38 మంది వైద్యుల పోస్టుల ఖాళీలు ఉండగా, 9 మంది డిప్యుటేషన్, ఇద్దరు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వైద్యాధికారులు సమయానికి విధులకు హాజరుకాకపోవడం, వచ్చిన ఆరకొరగా వైద్యసేవలు అందించి వెళ్తుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రోగులు వైద్య సేవల కోసం సంగారెడ్డి, హైదరాబాద్, బీదర్ ప్రాంతాలకు వెళ్తున్నారు. నాలుగైదు రోజులుగా జహీరాబాద్ దవాఖానలో కాన్పులకు గర్భిణులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. కాన్పులకు వస్తే సంగారెడ్డికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారని గర్భిణుల కుటుంబీకులు వాపోతున్నారు.
జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్రవంతి, మహిపాల్, గౌస్గోరి, నాయకులు నామ రవికిరణ్, యాకూబ్, అబ్దుల్లా సోమవారం జహీరాబాద్ ఏరియా దవాఖానను విజిట్ చేసి, గర్భిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నాలుగైదు రోజులుగా దవాఖానలో వైద్యాధికారులు లేక కాన్పులు జరగడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న విధంగానే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు విమర్శించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే దవాఖానలో వైద్యాధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిరుపేదలు దవాఖానకు వస్తే సరైన వైద్యం లభించక ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించాల్సి వస్తున్నదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైద్యాధికారులపై సంబంధిత జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా అధికారులు ముగ్గురు వైద్యాధికారులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రోగులు కోరుతున్నారు.