ప్రారంభించిన మెదక్ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
జాబ్‌మేళాలో ఇంటర్వ్యూలు చేసిన 37 కంపెనీలు
హాజరైన 2877 మంది అభ్యర్థులు
ఉద్యోగాలకు 248 మంది ఎంపిక,
పరిశీలనలో మరో 193 మంది
పాల్గొన్న టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 27: సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 2,877 మంది నిరుద్యోగులు రాగా, 248 మందికి ఉద్యోగాలు లభించాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఉద్యోగావకాశాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, జాబ్‌మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించి ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. 37 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశాయి.
రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 37 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొనగా, ఉద్యోగాల కోసం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు 2,877 మంది హాజరయ్యారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి జాబ్‌మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ జాబ్‌మేళాకు హాజరై ఉద్యోగం పొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కాగా, జాబ్ మేళాకు సంబంధిత శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉద్యోగం పొందిన 248 మంది అభ్యర్థులు
జాబ్‌మేళాకు హాజరైన అభ్యర్థుల్లో 248 మంది ఉద్యోగం పొందారు. మరో 193 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. జాబ్‌మేళాలో పాల్గొన్న 37 కంపెనీల కోసం మొత్తం 37 టేబుల్స్ ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ఆయా ఉద్యోగానికి అవసరమైన వారిని ఎంపిక చేశారు. ఎంపికైన వారికి వెంటనే నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా యువజన సర్వీసులు, క్రీడాధికారి జి.రాంచందర్‌రావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జావేద్ అలీ, ఆర్డీవో మెంచు నగేశ్, ధృవ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చైర్మన్ మన్మోహన్, డైరెక్టర్ సత్యవాణి నారాయణం, పలు శాఖల అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.