మెదక్ అర్బన్, జూన్ 18 : మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అదుపులోకి వచ్చిందని, గొడవలకు కారణమైన 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి మంగళవారం తెలిపారు. ఇతర జిల్లాల నుంచి పోలీస్ బలగాలను రప్పించి పరిస్థితి అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలమన్నారు. మెదక్ గొడవలపై సమగ్ర విచారణ జరుగుతోందని, గొడవలకు కారణమైన వారిని విడిచి పెట్టేది లేదని ఎస్పీ తెలిపారు.