
మెదక్, జనవరి 25 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో హుండీ పగులగొట్టి చోరీ చేసిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెదక్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్‌కు చెందిన కొట్టాల లక్ష్మారెడ్డి జల్సాలకు అలవాటు పడి, తనకున్న వ్యవసాయ భూమితో పాటు రెండు డీసీఎంలను అమ్ముకొని, భార్యతో గొడవ పెట్టుకున్నాడు. పదేండ్ల క్రితం భార్య తన ఇద్దరు పిల్లలతో తల్లిగారిల్లయిన చిలిపిచెడ్ మండలం శీలంపల్లికి వచ్చింది. నేరస్తుడు లక్ష్మారెడ్డి కూడా అత్తగారింటికి వచ్చి అక్కడి నుంచి పటాన్చెరు, కొంపల్లి ఏరియాల్లో పాత పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు అమ్ముకొని జీవనం సాగిస్తూ మద్యానికి బానిసై డబ్బులు సరిపోక సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలు చేస్తున్నాడు. 2021లో కొంపల్లిలోని ఏటీఎం పగులగొట్టి దొంగతనం చేసే ప్రయత్నం చేయగా, పేట్ బషీర్‌బాగ్ పోలీసులు పట్టుకొని జైలుకు పంపారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత మళ్లీ చందానగర్‌లోని బిగ్‌సీ షాపులో 30 ఫోన్లు దొంగతనం చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత ఈ నెల 19న రాత్రి 11 గంటల సమయంలో ఏడుపాయల గుడిలో చొరబడి, హుండీ పగుల గొట్టి, రూ.2.86 లక్షలు, ఏడున్నర తులాల బంగారం, 250 గ్రాముల వెండి ఎత్తుకెళ్లాడు. దొంగతనం అనంతరం శీలంపల్లికి ఆటోలో అత్తగారింటికి వచ్చాడు. ఈ నెల 20న ఉదయం 6 గంటలకు అందులో రూ.60వేలను తీసుకొని మిగతా డబ్బులు ఇంటి ముందు గల పని చేయని వాషింగ్ మిషన్‌లో దాచి పెట్టాడు. ఈ నెల 25న పటాన్చెరు నుంచి పాటికి వెళ్లే దారిలో ఎల్లమ్మ గుడి వెనకాల గల నిర్మాణ దశలో ఉన్న గదుల్లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.2.26నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నా రు. కాగా, కేసును ఛేదించిన డీఎస్పీ సైదులు, మెదక్ రూరల్ సీఐ సుంకర విజయ్, పాపన్నపేట, మెదక్ రూరల్, కొల్చారం, హవేళీఘనపూర్ ఎస్సైలు విజయ్‌కుమార్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సంతోష్‌కుమార్, కానిస్టేబుళ్లను ఎస్పీ రివార్డులతో అభినందించారు.