మంగళవారం 26 మే 2020
Medak - May 24, 2020 , 01:53:35

పందిరి సాగు.. భలే బాగు

పందిరి సాగు.. భలే బాగు

మెదక్‌ : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంటల సాగు విధానంలోనూ తమ ఆలోచనా తీరును మార్చుకుంటున్నారు. గతంలో ఒకే రకమైన పంటలను ఏండ్ల తరబడి సాగు చేసి దిగుబడులు సాధించలేక.. వచ్చిన దిగుబడులతోనే సరిపెట్టుకున్న రైతులు ఇప్పుడు కొత్త పంథాలో పంటలను పండిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగు వేస్తున్నారు. మెదక్‌ జిల్లా 20 మండలాల్లోని రైతన్నలు వర్షాధార పంటలు పండిస్తూ వస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, చెరుకు, పత్తి, పప్పుధాన్యాల పంటలనే సాగు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వర్షాధార పంటలే కావడంతో దేవుడి మీద భారం వేసి ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తు న్నది. ఈ యాసంగి నుంచి జిల్లాలో ఎంపిక చేసిన రైతులకు పందిరి సాగులో కూరగాయల సాగు చేసేందుకు సబ్సిడీలు సైతం ఇచ్చింది. దీంతో జిల్లాలో చాలామంది రైతులు పందిరిసాగు విధానంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తుండటంతో దిగుబడి కూడా పెరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి..

పందిరి సాగు విధానంలో రైతులకు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువనే చెప్పాలి. ఒక ఎకరా పొలంలో పలు రకాల పంటలను సాగు చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఒకసారి సాగు చేస్తే చాలా కాలం వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. అదీగాక చీడపీడల బాధ తక్కువ, అలాగే పెట్టుబడు లు కూడా ఒక్కసారి పెడితే సరిపోతుంది. ప్రతీ రోజు కూరగాయలు కోసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో కూరగాయలకు డిమాండ్‌ ఉంటుంది. 

తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు..

రైతులు తక్కువ పెట్టుబడులతో, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో పంటలను పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక ఎకరా పొలంలో పలు రకాల పంటలను సాగు చేసే అవకాశం ఉంటుంది. అదీగాక చీడపీడల బాధ తక్కువ, అలాగే పెట్టుబడులు కూడా ఒక్కసారి పెడితే సరిపోతుంది.

- స్వామి, రైతు చల్మెడ, నిజాంపేట మండలం

మార్కెట్‌లో కూరగాయలకు బాగా డిమాండ్‌ ఉన్నది..

కూరగాయలకు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉన్నది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పందిరిసాగు కోసం ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తున్నది. దీంతో రైతులు చాలా మంది పందిరిసాగులో పంటలను పండిస్తున్నారు. పండించిన పంటను వెంట వెంటనే మార్కెట్‌కు తరలించి లాభాలు పొందుతున్నారు.

- సాయిరెడ్డి, రైతు, వల్లభాపూర్‌, చేగుంట మండలం


logo