శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 20, 2020 , 02:37:29

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం
  • - నాలుగు మున్సిపాలిటీలలో 73 వార్డులు 318 మంది అభ్యర్థులు పోటీ
  • - 150 పోలింగ్‌ కేంద్రాలు
  • - 900మంది పోలింగ్‌ సిబ్బంది
  • - అతి సమస్యాత్మకం 50, సమస్యాత్మకం 38
  • - కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగంమెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సి‘పోల్స్‌'కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ధర్మారెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. జిల్లాలోని మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట మున్సిపాలిటీలలో మొత్తం 75 వార్డులకు గానూ రెండు వార్డులు ఏకగ్రీవం కాగా 73 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ వార్డుల్లో మొత్తం 82,270 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 73 వార్డులకు 318 మంది బరిలో ఉండగా 900 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ధర్మారెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, మొత్తం 75 వార్డులకు గాను, రెండు ఏకగ్రీవమయ్యాయి. 73 వార్డులకు పోటీ జరుగుతున్నది. తూప్రాన్‌లో 16 వార్డులు, మెదక్‌లో 30 వార్డులు, నర్సాపూర్‌లో 15 వార్డులు, రామాయంపేటలో 12 వార్డుల్లో పోలింగ్‌ జరుగనున్నది. ఈ వార్డుల్లో మొత్తం 82,270 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 73 వార్డులో మొత్తం 318 మంది బరిలో ఉండగా 900 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు మున్సిపాలిటీలకు పంపించగా బ్యాలెట్‌ పత్రాల పరిశీలన కూడా దాదాపు పూర్తయిందని కలెక్టర్‌ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

73 వార్డుల బరిలో 318 మంది

జిల్లాలో 4 మున్సిపాలిటీలలో 73 వార్డుల్లో జరుగనున్న ఎన్నికల్లో  318 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని మున్సిపాలిటీలో మొత్తం 73 వార్డులుండగా తూప్రాన్‌లో 16, రామాయంపేట12, నర్సాపూర్‌ 15, మెదక్‌లో 32 వార్డులు ఉన్నాయి. ఇందులో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మెదక్‌ మున్సిపాలిటీలో 30 వార్డులకు పోటీ జరుగనున్నది.

ఎన్నికల విధుల్లో 900 మంది..

మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో మొత్తం 900 మంది సిబ్బంది పాల్గొననున్నారు. వీరికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో 12 మంది రిటర్నింగ్‌, 30 మంది జోనల్‌, 20 నిబంధన పరిశీలక బృందాలు, మరో 8 ఇతర బృందాలు పని చేస్తాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం అన్ని మున్సిపాలిటీలలో 150 పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఇద్దరు చొప్పున పోలీసులు విధులు నిర్వహిస్తారు.

బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన పూర్తి...

మున్సిపల్‌ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం బ్యాలెట్‌ పేపర్లు, బ్యాక్సులు సిద్ధం చేసి అన్ని మున్సిపాలిటీలకు పంపించారు. పోలింగ్‌ కేంద్రానికి ఒకటి చొప్పున జిల్లాలో 150 పోలింగ్‌ కేంద్రాలుండగా, అంతే మొత్తంలో బ్యాలెట్‌ బాక్సులున్నాయి. మున్సిపాలిటీల  వారీగా అవసరమైన మేర  బ్యాలెట్‌ పత్రాలు రెడీ చేశారు. తప్పులు, ఇతర పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. వార్డులకు నంబరింగ్‌ ఇచ్చారు.

కేంద్రాల వద్ద అన్ని వసతులు..

పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించారు. వికలాంగులు కేంద్రంలోనికి రావడానికి ర్యాంపులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆటోలు, ట్రై సైకిళ్లు ఇతర వాహనాలను ఏర్పాటు చేసి నేరుగా వారిని కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేయించనున్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్ల ఎదుట అభ్యర్థుల పేర్లు, గుర్తులతో కూడిన బ్యానర్‌ను ఏర్పాటు చేస్తారు.  ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌కు ముందురోజే 21న సాయంత్రం పోలింగ్‌ కేంద్రాలకు వస్తారు. పోలింగ్‌ ముగిసిన తరువాత అవే బస్సుల్లో తిరిగి వెళ్తారు.

నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలు...

మెదక్‌ కౌంటింగ్‌ కేంద్రం: వైపీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల
వైపీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెదక్‌ మున్సిపాలిటీకి సంబంధించి 32 వార్డుల్లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులను పంపిణీ చేయనున్నారు.

రామాయంపేట కౌంటింగ్‌ కేంద్రం :ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
రామాయంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రామాయంపేట మున్సిపల్‌ పరిధిలోని 12 వార్డులకు సంబంధించి కౌంటింగ్‌ కేంద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించనున్నారు. అక్కడే బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచి ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్‌ బాక్సుల పంపిణీ మాత్రం సాయిబాలాజీ ఫంక్షన్‌ హాల్‌ నుంచి జరుగనున్నది.

తూప్రాన్‌ కౌంటింగ్‌ కేంద్రం : నోబెల్‌ పార్మసీ కళాశాల
తూప్రాన్‌ మున్సిపల్‌ పరిధిలోని 15 వార్డులకు సంబంధించి వార్డుల కౌంటింగ్‌ కేంద్రాన్ని తూప్రాన్‌ సమీపంలోని లింగారెడ్డిపేట వద్ద ఉన్న నోబెల్‌ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేశారు.

నర్సాపూర్‌ కౌంటింగ్‌ కే్రందం : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
నర్సాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని 16 వార్డులకు సంబంధించి వార్డుల కౌంటింగ్‌ కేంద్రాన్ని నర్సాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. అక్కడే బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచి ఓట్లను లెక్కించనున్నారు.

మున్సిపాలిటీల్లో, పోలింగ్‌ 22న జరుగనుండగా 20 సాయంత్రం నుంచి మున్సిపాలిటీల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ప్రచారం కూడా ఆరోజు నుంచే ముగియనున్నది.

పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఈనెల 22న జరుగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్ని చర్యలు చేపట్టారు. జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేటలో 150 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సమస్యాత్మకం, అతిసమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. వాటిలో పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 51 పోలింగ్‌ కేంద్రాలను అతిసమస్యాత్మకంగా గుర్తించారు. 38 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. వాటిలో వెబ్‌కాస్టింగ్‌ను చేయనున్నారు.logo