చిలిపిచెడ్, ఆగస్టు 15: మెదక్ జిల్లాలోని చిలిపిచెడ్ మండలంలో (Chilipched) రెండు రోజుల నుంచి కుడుస్తున్న భారీ వర్షాలకు పాత ఇండ్లు నేల కూలగా, వరి, పత్తి పంటలు నీటమునిగాయి. మండలంలో 154 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాసిల్దార్ సహదేవ్ తెలిపారు. మండలంలోని చండూర్, చిట్కుల్, గౌతపూర్, గిరిజన తండాలలో భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లో నీరు చేరాయి.
ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా రైతులు, మత్య్సకారులు, గొర్రె మేకల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలకు ఏదైనా అవసరం ఉంటేనే బయటకు రావాలన్నారు. విద్యుత్ స్తంభాలను, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వైర్లను ముట్టుకోవద్దన్నారు. చెరువులు, కుంటల్లో చేపల వేటకు వెళ్లకూడదని చెప్పారు. అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి సాయం తీసుకోవాలని తెలిపారు. అనంతరం భారీ వర్షాలకు మండలంలో కూలిపోయిన ఇండ్లను తాసిల్దార్, ఆర్ఐ పరిశీలించారు.