మెదక్ మున్సిపాలిటీ, జనవరి 24 : దేశ పురోగతిని మార్చేసే గొప్ప ఆయుధం ఓటు. మన తలరాతల్ని మార్చే నేతల్ని ఎన్నుకునే మంత్రదండం. ఒక్క సెకనులో మనం చూపే విచక్షణ మన గతినే మార్చేస్తున్నది. అలాగే, నిత్య జీవితంలోనూ బహుళ ప్రయోజనకారిగా ఓటరు గుర్తింపు కార్డు ఉపయోగడుతున్నది. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఎంత ప్రాధాన్యం ఉందో, అంతే ప్రాముఖ్యం ఓటరు గుర్తింపు కార్డుకు కూడా ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇదే ప్రామాణికంగా గుర్తింపునిచ్చింది. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవంపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
సమర్థవంతుడైన నాయకుడితోనే సమాజంలో మార్పు సాధ్యపడుతున్నది. ఓటు హక్కుతో సమర్థుడైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. కానీ, ఎన్నికల్లో ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఓటరు కార్డు తప్పనిసరి.
అన్నింటికీ ఓటరు కార్డు తప్పనిసరి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఓటరు గుర్తింపు కార్డు నిత్యకృత్యంగా మారింది. అన్నివర్గాల వారికి దీని అవసరం తప్పనిసరి అయ్యింది. ప్రభుత్వ పథకాలన్నింటికీ బ్యాంకు ఖాతాలతో ముడిపెడుతున్నారు. రాయితీలన్నీ నగదు బదిలీ పథకం ద్వారా అందిస్తుండడంతో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాను కలిగి ఉండడం తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతా తెరవాలంటే నివాస ధ్రువీకరణగా ఓటరు కార్డు ఉపయోగపడుతున్నది. సామాజిక పింఛన్లు వంటి వాటికి కూడా ఓటరు కార్డు అవసరం తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, వంటగ్యాస్, విద్యుత్తు కనెక్షన్, సెల్‌ఫోన్‌లోని సిమ్‌కార్డు పొందాలన్నా ఓటరు గుర్తింపు తప్పనిసరి ఉండాల్సిందే. ప్రభుత్వం 18 ఏండ్లు నిండిన ప్రతి యువకుడు స్థానిక ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. దాని విలువ తెలియజేయడానికే కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నది.
ఓటుహక్కు ప్రస్థానం…
మన దేశం బ్రిటీష్ పరిపాలనలో ఉన్న సమయంలో తొలి విడుతగా 1884లో స్థానిక సంస్థలకు, 1892లో ప్రాంతీయ మండలితో పాటు 1937లో ఎన్నికలను నిర్వహించారు. అయితే, ఈ ఎన్నికల్లో కొంతమందికి మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో విద్యావంతులు, పన్ను చెల్లింపుదారులు, సంపన్నులు మాత్రమే ఉన్నారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారం దేశంలో 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించారు. 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2011 జనవరి 25 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.
ఎన్నికల నిర్వహణ..
దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తారు. ఓటరు జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించకోవచ్చు. జనవరి 5న ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం మెదక్ జిల్లాలో 4,11,270 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,00470, మహిళలు 2,10,792, ఇతరులు 8 మంది ఉన్నారు. పురుషుల కంటే 10,322 మంది మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
ఓటు విలువైనది..
ఓటు చాలా విలువైనది. 18 ఏండ్లు నిండిన యువతీయువకులు తప్పకుండా ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి. పేరు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్, మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో ఫారం నెం 6ను అందుబాటులో ఉంచుతున్నది. పోలింగ్ బూత్‌లవారీగా బూత్ లెవల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. భారత పౌరుడైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండాలి.