మెదక్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు హాజరై దరఖాస్తులు ఇవ్వడం,అధికారులు వాటిని స్వీకరించడం మామూలై పోయింది. ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్ పాల్గొని అర్జీలను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. కానీ, ఆయా శాఖల అధికారులు మాత్రం వేగంగా పరిష్కరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తుల స్టేటస్ తెలియకపోవడంతో ప్రజలు మళ్లీ మళ్లీ అర్జీలు ఇస్తున్నారు. ఇది ప్రజలకు వ్యయప్రయాసంగా మారింది.
మెదక్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): మెదక్ కలెక్టరేట్లో ‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని అర్జీదారులు(బాధితులు) వాపోతున్నారు. ప్రధానంగా ప్రజావాణిలో భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది జనవరి 1 నుంచి ఈ ఏడాది మార్చి 18 వరకు 1167 దరఖాస్తులు(అర్జీలు) పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుదారులు తమ సమస్య పరిష్కారం కోసం ఇచ్చిన అర్జీలు పరిష్కారానికి నోచుకోక పోవడంతో, మళ్లీ అదే సమస్యపై ప్రజావాణిలో దరఖాస్తు చేస్తున్నారు. దీంతో బాధితులకు వ్యయప్రయాసలు తప్ప డం లేదు.
2023 జనవరి 1 నుంచి ఈ సంవత్సరం మార్చి 18 వరకు మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయా శాఖలకు 5657 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 4490 పరిష్కారం కాగా, 1167 పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని శాఖలకు సంబంధించి దరఖాస్తులు అసలే పరిష్కారం కాకపోవడం గమనార్హం. సివిల్ సప్లయ్ కార్యాలయంలో 68 దరఖాస్తులు రాగా, 28 మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇందులో 40 దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. కలెక్టరేట్లోని హెచ్ విభాగంలో 103 దరఖాస్తులు రాగా, 58 మాత్రమే పరిష్కారం కాగా, 45 పెండింగ్‌లో ఉన్నాయి.
కలెక్టరేట్ డీ విభాగంలో 938 దరఖాస్తులు రాగా, 867 పరిష్కారం కాగా, 71 పెండింగ్‌లో పెట్టారు. డీఆర్డీవోలో 404 దరఖాస్తులు స్వీకరించగా, 310 పరిష్కారం కాగా, 94 పెండింగ్‌లో ఉన్నాయి. ఇకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 40 దరఖాస్తులు రాగా, ఒక్క దరఖాస్తు కూడా పరిష్కరించలేదు. లేబర్ కార్యాలయంలో 18 దరఖాస్తులు రాగా, ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో 24 దరఖాస్తులు రాగా, ఒక్క దరఖాస్తు మాత్రమే పరిష్కరించారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో 186 దరఖాస్తులు రాగా, 128 పరిష్కరించగా, 58 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. చేగుంట తహసీల్ కార్యాలయంలో 147 రాగా, 112 పరిష్కరించి, 35 పెండింగ్‌లో ఉంచారు. ఇలా ప్రతి శాఖలో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి.
మెదక్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజావాణిలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్, అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారు. ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదులు ఇస్తున్నా, అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు మళ్లీ కలెక్టరేట్లోని ప్రజావాణికి హాజరై ఉన్నతాధికారులకు సమస్య చెబుతున్నారు.
దీంతో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ప్రజలతో కిటకిటలాడుతోంది. వందల సమస్యలు ఈ ప్రజావాణికి వస్తున్నాయి. కొన్నింటిని ఇక్కడ వెంటనే పరిష్కరిస్తున్న ఉన్నతాధికారులు, క్షేత్ర స్థాయిలో పరిష్కరించాల్సిన వాటిని ఆయా మండలాలకు పంపుతున్నారు. అక్కడికి వెళ్లిన దరఖాస్తులు త్వరగా పరిష్కారం కావడం లేదు. దీంతో బాధితులు మళ్లీమళ్లీ కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నారు.