శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతున్న రక్షక భటుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మంత్రి హరీశ్‌రావు పోలీస్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు చేస్తూ అవసరమైన చికిత్స అందించేందుకు జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. గురువారం (నేడు) ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పోలీస్ హెల్త్ ప్రొఫైల్ క్యాంపుతో పాటు ఆధునీకరించిన సిద్దిపేట రూరల్ పీఎస్ భవనం, స్నేహిత సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
సిద్దిపేట అర్బన్, జనవరి 4: రక్షక భటుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మంత్రి హరీశ్‌రావు పోలీస్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు చేస్తూ పలు అవగాహన సదస్సులు నిర్వహించడమే కాకుండా అవసరమైన చికిత్స అందించేందుకు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సీపీ శ్వేత ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో మొదటి విడుతగా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు నేడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పోలీస్ హెల్త్ ప్రొఫైల్ క్యాంప్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల నిపుణులతో విడుతల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు రెండేండ్ల పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు పరీక్షలు చేసి చికిత్స అందించనున్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా బ్లడ్, యూరిన్ ఇలా 55 రకాల టెస్టులు నిర్వహించడంతోపాటు బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. రాష్ర్టానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో, సీపీ శ్వేత నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ అవకాశాన్ని పోలీస్ అధికారులు, సిబ్బంది సద్వినియో గం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, రోజూ వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం వంటి నాలుగు సూత్రాలు తప్పకుండా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మెదక్ రోడ్డులో గల సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఆధునీకరించిన సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.