పంట సాగుపై ధీమా వ్యక్తం చేస్తున్న రైతన్న
మార్కెట్లో వాముకు మంచి ధర
ఆసక్తి కనబరుస్తున్న రైతన్నలు
కోహీర్, ఫిబ్రవరి24: వాము(వోమ) పంటను సాగు చేసే రైతన్నలు లాభాల బాట పడుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వామును పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పంట సాగు విస్తీర్ణం పెరిగింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో 200ఎకరాల్లో వాము పంటను సాగు చేస్తున్నారు. కోహీర్, మద్రి, పైడిగుమ్మల్, చింతల్ఘట్, గురుజువాడ, రాజనెల్లి, తదితర గ్రామాల రైతులు పంటను అధికంగా సాగుచేస్తున్నారు. ఆగస్టు తొలి వారంలో చేనులో విత్తనాలు చల్లితే ఏడు నెలల తర్వాత పంట చేతికొస్తున్నది. నల్లరేగడిలో అయితే దిగుబడి మరింత పెరుగుతుంది. విత్తనం నాటిన రెండు నెలలకు ఒకసారి కలుపు తీస్తే సరిపోతుంది. ఎరువులు, మందుల పిచికారీ, తదితర ఖర్చులు ఉండవు. కేవలం పంట కోత సమయంలోనే కూలీల ఖర్చు భరించాల్సి ఉంటుంది.
మార్కెట్లో మంచి డిమాండ్
కోహీర్ మండలంలో సాగు చేసే వాము పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. క్వింటాకు రూ.15 నుంచి రూ.16వేల వరకు ధర పలుకుతున్నది. ఇక్కడ పండిన పంటను వికారాబాద్, పట్లూర్, మర్పల్లి, సదాశివపేట, తదితర పట్టణాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నారు. కోహీర్ వాము అనగానే అక్కడి వ్యాపారులు సంతోషంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి వాము రుచిగా ఉంటుంది. దీంతో వారు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. వాముతో పాటు పొట్టుకు కూడా డిమాండ్ ఉంది. క్వింటాలుకు రూ.2వేలకు పైగా ధర చెల్లించి కొంటున్నారు. ఎకరానికి 6 నుంచి 7క్వింటాళ్ల వాము దిగుబడి అవుతున్నది. దీంతో రైతన్నలకు లాభాలు తెచ్చిపెడుతున్నది.
చేనులో వెదజల్లడమే..
నేను ఐదు ఎకరాల్లో పంట వేశా. చేనులో విత్తనాలను వెదజల్లడంతో వాము మొలకలు వస్తాయి. ఒక్కసారి కలుపు తీస్తే సరిపోతుంది. వేరే ఖర్చులు ఏమీ ఉండవు. కేవలం పంట కోసేటప్పుడు కూలీల ఖర్చులుంటాయి.
–నర్సింహులు, రైతు, కొత్తూర్(డి)