
సిద్దిపేట, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, చెరువులు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వచ్చే రెండు మూడు రోజులు భా రీ వర్షాలు పడుతాయని వాతావారణ శాఖ హె చ్చరించింది. దీంతో జిల్లాల అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితులు ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావు సమీక్షిస్తున్నారు. వెనువెంటనే అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, అప్రమత్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో ని ర్మించిన అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లు గోదావరి జలాలతో నిండుగా ఉన్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి ఇటీవల టెస్ట్ రన్ నిర్వహించి, 5 టీఎంసీలకు పైగా నీటిని నింపారు. వీటితో పాటు తోటపల్లి, తపాస్‌పల్లి, లద్నూనూర్ రిజర్వాయర్లున్నాయి. జిల్లాలో శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు వారం రోజులుగా అలుగు పారుతున్నది. ప్రధాన వాగులైన హల్దీవాగు, కుడ్లేరు వాగు, మోయతుమ్మెద వా గులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వీటిపై నిర్మించిన వందకు పైగా చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి.
సిద్దిపేట వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలతో పాటు చెరువులు దాదాపుగా నిండాయి. రాజగోపాల్‌పేట పెద్ద చెరువు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, గజ్వేల్ పాండవుల చెరువు, దుబ్బాక రాయసముద్రం చెరువు.. ఇలా జిల్లాలోని అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. మోయతుమ్మెద పొంగిపొర్లడంతో హుస్నాబాద్- సిద్దిపేట రహదారిపై బస్వాపూర్ వద్ద, కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద రాకపోకలు నిలిచాయి. చేర్యాల మండలంలోని పలు ప్రాంతాల్లో లోలెవల్ బ్రిడ్జిలు ఉండడంతో తాడూరు, చిట్యాల, దానంపల్లి, గ్రామాల ప్రజలు చేర్యాల పట్టణానికి చేరుకోలేకపోతున్నారు. కడవెర్గులో కల్వర్టు పొంగుతుండడంతో నాగపూరి, పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
అధికారుల ముందస్తు చర్యలు
మెదక్ జిల్లాలో ప్రధానమైన చెరువులు అలుగు పారుతున్నాయి. వనదుర్గా, పోచారం, రాయనిపల్లి ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. హల్దీవాగు, పసుపులేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హల్దీవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలతో పాటు కూచన్‌పల్లి చెక్‌డ్యాం అలుగు పారుతున్నది. ఇలా జిల్లాలోని ప్రధానమైన వాగులు, చెరువు లు అలుగులు పారుతుండడంతో మెదక్ జిల్లాలో ఎటు చూసినా నీటి ప్రవాహం కనిపిస్తున్నది. మెదక్ మండలం మల్కాపూర్ తండాకు రాకపోకలు నిలిచాయి. జిల్లాలో ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేలను గుర్తించి ప్రయాణికులను ఆ మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుం డా ముందస్తుగా అన్ని రకాలు చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్ సింగూరు ప్రా జెక్టు నిండింది. గంగకత్వ వాగు, నక్కవాగులు ప్రవహిస్తున్నాయి. చినిగేపల్లి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు, వాగులు పొంగుతున్నాయి.
చెరువులకు జలకళ
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 90శాతానికి పైగా చెరువులు అలుగు పారుతున్నా యి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. మరో మూ డు రోజులు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముండడంతో జిల్లాలోని అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదకరమైన కాజ్‌వేల గుండా రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల ద్వారా ప్రయాణికులను పంపుతున్నారు. వర్షాల కారణంగా రెండు, మూడు రోజుల్లో జిల్లాలో సుమారుగా 10మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్ర తి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకరావాలని సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.