
చిన్నకోడూరు, ఆగస్టు 30 : ఎన్నడూ లేని విధంగా సోమవారం తెల్లవారుజామున 13సెం.మీ వర్షం కురవడంతో మల్లారంలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె సివరేజీ బోర్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో 6.6 కేవీ పంప్ హౌస్ నీట మునిగిందని, రెండు నుంచి మూడు రోజుల్లో శాశ్వత ప్రాతిపదికన రిస్టోరేషన్ చర్యలు చేపడతామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. భారీ వర్షాలకు నీట మునిగిన చిన్నకోడూర్ మండలం మల్లారంలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె సివరేజీ బోర్డు వాటర్ ప్లాంట్ పంప్ హౌస్‌ను సోమవారం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుండపోత వర్షంతో ఉధృతమైన వరద నీరు వచ్చి 6.6 కేవీ పంప్‌హౌస్ మునిగిందని, దీంతో హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్‌తో పాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చర్ పరిధిలోని 1950 హాబిటేషన్లకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె సివరేజీ బోర్డు ఎండీ దానకిశోర్ నేతృత్వంలో యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఒకటి నుంచి రెండు రోజుల్లో తాత్కాలిక ప్రాతిపాదికన, రెండు నుంచి మూడు రోజుల్లో శాశ్వత ప్రాతిపదికన రిస్టోరేషన్‌తో పాటు పూర్తి స్థాయిలో పంపింగ్ చర్యలు చేపడుతామన్నారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో రింగ్ మెయిన్ ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నామన్నారు. పంప్ హౌస్ నీట మునకతో మల్లారం ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా తాగునీటి సరఫరా ఎదురయ్యే తాత్కాలిక అడ్డంకులను అధిగమించేందుకు హిమయత్సాగర్, గండిపేట, ఉస్మాన్‌సాగర్, సింగూరు నుంచి హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా పెంచుతామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతామన్నారు. అనంతరం చిన్నకోడూరు మండలంలోని రామునిపట్ల గ్రామంలో పాక్షికంగా నీట మునిగిన మహారాజుల కాలనీలోని ఇండ్లను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వర్షాలతో నిత్యావసరాలు నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. శాశ్వత పరిష్కారంగా రామునిపట్ల గ్రామంలోని బ్రిడ్జిని పెద్దగా చేస్తామన్నారు.
ఆందోళన వద్దు.. ఆదుకుంటాం..
భారీ వర్షాల నేపథ్యంలో నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. సీతారాంపల్లిలో కోమడోనికుంట నిండి, వరద నీటితో ధ్వంసమైన బీటీ రోడ్డు, ఖాతా రోడ్డును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాశ్వత ప్రాతిపదికన ఖాతా రోడ్డు పునరుద్ధ్దరణకు ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన కౌలు రైతు లక్ష్మణ్‌కు రూ.25 వేల తక్షణ ఆర్థిక సహాయం చెక్కును మంత్రి అందజేశారు. అక్కెనపల్లిలో పాక్షికంగా నీట మునిగిన బుడగ జంగాల కాలనీని సందర్శించి, బాధితులను పరామర్శించారు. గుడిసెలో నివసిస్తున్న పేదలకు డబుల్ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు మండలంలోని కాశిగుడిసెల కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 20రోజుల్లోగా ఇండ్లు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్ డెవిస్ తదితరులు పాల్గొన్నారు.