
రామాయంపేట, జూలై 4: గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పచ్చదనంతో నిండి ఉండేలా గ్రామాలకు పచ్చందాలు తేవాలని జిల్లా పరిషత్ సీఈవో శైలేష్‌కుమార్ అన్నారు. ఆదివారం నాల్గో విడుత పల్లె ప్రగతి, ఏడో విడుత హరితహారంలో భాగంగా రామాయంపేట మండలం కాట్రియాల, పర్వతాపూర్ గ్రామాలకు ఆకస్మికంగా విచ్చేసి పరిసరాలను పరిశీలించారు. కాట్రియాల గ్రామానికి రావడంతోనే రోడ్డుకు ఇరువైపులా పచ్చందాలతో పచ్చగా మొక్కలు కనిపించడంతో సర్పంచ్ శ్యాములు, కార్యదర్శి రాములను అభినందించారు. కాట్రియాలలో పల్లె ప్రగతి పనులు చాలా చక్కగా పక్కాగా చేయడం మంచి పరిణామమని అన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే రోగాలు దరి చేరవన్నారు. కాట్రియాల ఊరంతా కలియ తిరిగి మొక్క మొక్క ను పరిశీలించి వాటికున్న ట్రీ గార్డులను చూసి మురిసిపోయారు. అనంతరం మండల అధికారులతో కలిసి గ్రామంలో శ్రమదానం చేపట్టి వీధులను ఊడ్చారు. గ్రామంలోని మహిళా సంఘాలతో ముచ్చటించి ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసేకుంటున్నారా అని అడిగారు. సీఈవో వెంట రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ప్రత్యేక అధికారి రాయరావు శ్రీనివాసరావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, గ్రామాల సర్పంచ్ లు మైలారం శ్యాములు, బోయిని దయాలక్ష్మి, స్వామి, ఉపసర్పంచ్ స్రవంతి, డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని రామాయంపేట మన్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం అన్నారు. మల్లెచెరువు ప్రాంతంలోని పీఏసీఎస్ చైర్మన్ మొక్కలు నాటారు. ఆరో వార్డులో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ ఇంటింటికీ వెళ్లి మహిళలకు మొక్కలను అందజేశారు. మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ చంద్రకళ వీధులను సర్పంచ్‌తో కలిసి శుభ్రం చేశారు. రాయిలాపూర్‌లో సర్పంచ్ నర్సాగౌడ్ సీసీ రోడ్ల పక్కన ట్రాక్టర్ల ద్వారా మట్టిని పోశారు. కార్య క్రమంలో మండల, గ్రామ ప్రత్యేక అధికారులు గిరిజారిణి పాల్గొన్నారు. విద్యుత్ సిబ్బంది మండల వ్యాప్తంగా విద్యుత్ ట్రాన్సుఫార్మర్ల వద్ద పిచ్చి మొక్కలను తొలిగించారు.
తూప్రాన్ మండలంలో
తూప్రాన్ మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులు ఊపందుకున్నాయి. నాల్గొ రోజు కావడంతో ఆయా గ్రామాల్లో గ్రామస్తులు సమష్టి భాగస్వామ్యంతో శ్రమదానం పనులను నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. ఇస్లాంపూర్‌లో ఎంపీడీవో అరుంధతి పర్యటించి గ్రామస్తులతో కలిసి శ్రమదానం పనుల్లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీవో రమేష్,ఈజీఎస్ ఏపీవో సంతోష్‌రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్‌లు,కార్యదర్శులు,ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.
జోరుగా పల్లె ప్రగతి పనులు
మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం ప్రజాప్రతినిధులు శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. రాంపూర్‌లో సర్పంచ్ రజిత గ్రామస్తులతో కలిసి అంతర్గత సీసీ రోడ్లకు ఇరువైపుల చెత్త,కలుపు మొక్కలు తొలగించారు.
చేగుంట మండలంలో…
చేగుంట, జూలై 4: మండల పరిధిలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ఆదివారం జోరుగా కొనసాగాయి. రెడ్డిపల్లిలో మండల ప్రత్యేక అధికారి జయరాజ్,ఎంపీడీవో ఉమాదేవి,గ్రామాల్లో జరుగుతున్న పల్లె పనులను పరిశీలించారు. చందాయిపేటలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత సబ్‌స్టేషన్‌లో పెరిగిన పిచ్చిమొక్కలను తొలిగించారు.
నార్సింగిలో…
మండల కేంద్రమైన నార్సింగితో పాటు వల్లూర్, జెప్తి శివు నూర్, సంకాపూర్తో గ్రామాల్లో రోడ్లను శుభ్రం చేసి,పిచ్చి మొక్కలు తొలిగించి,మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబీత,వైస్ ఎంపీపీ దొబ్బల సుజాత,సర్పంచ్ షేక్ షరీఫ్,ఆర్ సుజాత,ఆనందాస్ మహేశ్వరి,ఎంపీటీసీ బండారు సంతోష తదితరులున్నారు.
పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం
నర్సాపూర్, జూలై 4: పట్టణ ప్రగతిలో మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆరో వార్డులో సమావేశాన్ని నిర్వహించి వార్డుల్లోని సమస్యలను గుర్తించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్‌కుమార్, మున్సిపల్ సిబ్బంది, పట్టణ వాసులు పాల్గొన్నారు.
శ్రమదానంతో గ్రామాన్ని మార్చుకుందాం..
మనోహరాబాద్, జూలై 4 : పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, గ్రామం కోసం శ్రమదానం చేసి ఆదర్శ గ్రామంగా మార్చుకుందామని డీఎల్పీవో వరలక్ష్మి అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో ఆదివారం ఆమె పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.