
మెదక్, జూలై 2: పండ్ల తోటల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం రాయితీలను అందిస్తున్నది. కొత్తగా పండ్ల తోటలు, కూరగాయల నారు పెంపకం, నీటికుంటల నిర్మాణాలకు ఉద్యాన మిషన్ పథకం ద్వారా అభివృద్ధి చేయనున్నారు. 2021-22 సంవత్సరంలో ఉద్యాన మిషన్ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి మొదటి మూడేండ్లకు రాయితీ ఇవ్వనున్నారు. దీనికి గాను ఈ ఏడాది మెదక్ జిల్లాలో 12.50 ఎకరాల్లో మామిడి, 50 ఎకరాల్లో జామ, 12.50 ఎకరాల్లో బొప్పాయి, 25 ఎకరాల్లో అరటి సాగుకు లక్ష్యాలను నిర్దేశించారు. వీటికే కాకుండా మరిన్ని పండ్ల తోటలకు దీనిని అమలు చేయనున్నారు. ఇందులో ఉసిరి 10 ఎకరాలు, నేరేడు 2.50 ఎకరాలకు పొడిగించారు. అంతేకాకుండా కూరగాయల నారు సరఫరా పథకంలో భాగంగా టమాట, వంకాయ, మిరప నారు సబ్సిడీపై అందించనున్నారు. దీనికోసం రైతులు టమాట, వంకాయకు ఎకరాకు రూ.1,500, మిరపకు ఎకరాకు రూ.1,280 డీడీ రూపంలో 40 రోజుల ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. 15 ఏండ్లు పైబడిన మామిడి తోటల పునరుద్ధరణకు ఎకరాకు రూ.8వేల రాయితీ ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లాకు 25 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. నీటి కుంటల నిర్మాణాలకు గాను రూ.75 వేలు రాయితీ ప్రభుత్వం అందజేస్తున్నది. ఈ ఏడాది జిల్లాకు 12 నీటి కుంటల నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించారు. మల్చింగ్ విభాగంలో 70 ఎకరాలకు గాను ఎకరానికి రూ.6,400 రాయితీ, ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు..
సాగుకు ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా రాయితీలు మంజూరు చేస్తున్నది. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు ఉపయోగించే వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను సైతం రాయితీపై అందిస్తున్నారు. మెదక్ జిల్లాకు 3 మినీ ట్రాక్టర్లు, 5 బ్రష్ కట్టర్లు, 9 ట్రాక్టర్ ఆధారిత స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలి. ఉద్యానశాఖ అధికారి కె.మౌనికారెడ్డి మెదక్, 7997725285, రామకృష్ణ, నర్సాపూర్ డివిజన్ 7997724922, వేణుమాధవ్ (మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్) 7997725289 నంబర్లను సంప్రదించవచ్చు.
సూక్ష్మనీటి సేద్య పథకంలో పరికరాలు…
ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖకు రాష్ట్ర సూక్ష్మనీటి సేద్య పథకంలో మెదక్ జిల్లాకు 338 హెక్టార్లకు బిందు, తుంపర సేద్య పరికరాలను రైతుల పొలాల్లో అమర్చుటకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఇందులో 388 హెక్టార్లలో 268 హెక్టార్లు బిందు సేద్యానికి (డ్రిప్ ఇరిగేషన్), 70 హెక్టార్లు తుంపర సేద్యానికి (స్పింక్లర్ల) రాయితీపై అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మెదక్ జిల్లా లక్ష్యం చాలా తక్కువగా ఉంది. వీటికోసం దరఖాస్తు పెట్టుకున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లా పరిధిలో రైతులు మీ సేవలో టీఎస్ఎంఐపీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని రైతులను ఎంపిక చేయనున్నారు. 2017, 2018, 2019లో దరఖాస్తు చేసుకుని, డ్రిప్ పరికరాలు రాకుండా ఉన్న వారు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలో లేక సంబంధిత ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించాలని అధికారులు సూచించారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ పనిముట్లలోనూ రాయితీలు పొందవచ్చు. సూక్ష్మనీటి సేద్య పథకంలో 338 హెక్టార్లకు బిందు, తుంపర సేద్య పరికరాలు జిల్లాలో రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులు రాయితీలను వినియోగించుకోవాలి.