
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 30: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. సోమవారం చైర్మన్ అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ సభ్యులు రాజలింగం, వసంత్‌రాజ్, సమియొద్దీన్ హరితహారంలో నా టిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయకపోవడంతో మే కలు మేస్తున్నాయని వెంటనే ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని చైర్మన్‌ను కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నా టిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేశామని, మిగిలిన వాటికి చేస్తామన్నారు.
ఇంటింటికీ భగీరథ నీరు అందిస్తాం..
పట్టణంలో ఇంటింటికీ నీరందిస్తామని మున్సిపల్ చైర్మన్ అన్నారు. గౌరవ సభ్యులు మేడి కల్యాణి భగీరథ నీరు ఎప్పుడు అందిస్తారని, పనుల వల్ల ఏర్పడిన గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పనుల జాప్యాన్ని సమావేశంలో ప్రస్తావించగా చైర్మన్ జోక్యం చేసుకోని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డీఈ మహేశ్‌ను ఆదేశించారు. పనులు జాప్యం విషయాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లమన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్ధిదారులకు ఎప్పుడు అందజేస్తారని కల్యాణి మున్సిపల్ చైర్మ్న్ను అడుగగా 800 ఇండ్లలో 500 పూర్తయ్యాయని మిగిలిన వాటికి పనులు జరుగుతున్నాయని పూర్తి కాగానే కలెక్టరేట్ ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని అప్పుడు ప్రారంభిస్తారని చైర్మన్ తెలిపారు. కౌన్సిల్ సమావేశాలకు నూతనంగా నిర్మిస్తున్న సమావేశ మందిరం ఎప్పడు పూర్తవుతుందని కౌన్సిలర్ కృష్ణారెడ్డి చైర్మన్ అడగగా వచ్చే నెల సమావేశం నాటికి పూర్తవుతుందని చైర్మన్ సమాధానం ఇచ్చారు.
కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు..
పారిశుధ్య కార్మికులను ఇబ్బందుల పాలు చేయొద్దని కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, కృష్ణారెడ్డి, కిశోర్, జయరాజ్, సమియొద్దీన్లు సానిటరీ ఇన్స్పెక్టర్ వనితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దినసరి వేతనంపై పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రతి నెల వేతనాలు అందించాలన్నారు. వేతనాల్లో కోతలు విధిస్తున్నారని ఆరోపించగా,సానిటరీ ఇన్స్పెక్టర్ వనిత జోక్యం చేసుకొని ఆ విషయం నా పరిధిలోనికి రాదన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మూడు పట్టణ ప్రకృతి వనాలకు పెన్సింగ్తో పాటు హరితహారంలో మొక్కల రవాణా ఖర్చుల కోసం గాను రూ.20 లక్షల పట్టణ ప్రగతి నిధులు ఎజెండాలో చేర్చి ఆమోదించారు. ఇవే కాకుండా పలు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు శ్రీనివాస్, శేకర్, విశ్వం, లలిత, గాయత్రి, వనజ, వేదవతి, లక్ష్మి, మున్సిపల్ ఏఈలు సిద్ధేశ్వరి, బాలసాయగౌడ్, టీపీఎస్ లక్ష్మీపతి, ఆర్వో హర్షద్ అధికారులు పాల్గొన్నారు.