
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 6: విద్యార్థులందరూ విధిగా వ్యాక్సిన్ చేయించుకోవాలని స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. వెంకటేశం సూచించారు. స్థానిక తారా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్లు 1, 2, 3, 4 విభాగాల ఆధ్వర్యంలో స్థానిక ఇందిరానగర్‌లోని యూపీహెచ్సీ వైద్య సిబ్బంది సహకారంతో విద్యార్థులకు ఉచిత వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సోమవారం మొదటి రోజు కళాశాలలోని 612 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ తారా కళాశాలలో తరగతులకు హాజరయ్యే ప్రతి పీజీ, యూజీ విద్యార్థులు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ చేయించుకోని విద్యార్థులను తరగతులకు అనుమతించమని స్పష్టం చేశారు. వారం రోజుల పాటు కళాశాలలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సహకరించిన డీఎంహెచ్, పీహెచ్సీ వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పద్మజ, సిద్ధులు, ఎన్సీసీ అధికారి మనోజ్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.