సిద్దిపేట రూరల్, మార్చి 4: వారంతా కూలీనాలీ చేసుకొని పొట్టపొసుకొని జీవనం కొనసాగించేవారు. ఓటరు గుర్తింపుకార్డులున్నా సమైక్యాంధ్రలో వారిని లెక్కలోకి తీసుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపింది. సిద్దిపేటరూరల్ మండలంలోని రాఘవాపూర్ పంచాయతీకి దూరంగా ఉన్న పిట్టలవాడలో 13 కుటుంబాలు గుడిసెల్లో ఉంటున్నాయి. సిద్దిపేట- ముస్తాబాద్ ప్రధాన రోడ్డుకు ఆనుకొని మొక్కజొన్న కంకులు, మామిడి పండ్లు, సీతాఫలాలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే వారు చలికి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొందరు అనారోగ్యం బారినపడిన సందర్భాలు లేక పోలేదు. తెలంగాణ ప్రభుత్వం వీరి ఇబ్బందులను గుర్తించింది. పిట్టలవాడలో నివసిస్తున్న 13 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చింది. ఈ సంవత్సరం సీఎం కేసీఆర్ పుట్టిన రోజుకు ముందు మంత్రి హరీశ్‌రావు వీరికి పట్టాలు పంపిణీ చేశారు. దీంతో వారు పండుగొచ్చిందని సంబురాలు చేసుకున్నారు.
చూడచక్కగా డబుల్ ఇండ్ల నిర్మాణం
పిట్టలవాడలో డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చూడచక్కగా ఉంది. సీసీ రోడ్డు వేసి రియల్టర్ కూడా విస్తుపోయేలా ప్రభుత్వం ఇండ్లను నిర్మించి ఇచ్చింది. 13 ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వమే పూర్తి నిధులు ఖర్చు చేసింది.
13 ఇండ్లకుగానూ రూ.65.52 లక్షలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.13 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమీపంలో మిషన్ భగీరథ నీటిట్యాంకు నిర్మించారు. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు నల్లా కనెక్షన్ ఇచ్చారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతోనే సొంతింటి కల నెరవేరిందని, వారికి రుణపడి ఉంటామని పేదలు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సార్లు ఇచ్చిన కానుక సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సార్లు మాకు ఇచ్చిన పెద్ద కానుక. చాలా సంతోషంగా ఉంది. సొంతింటిలో ఉంటామని కలలో కూడా అనుకోలేదు. గింత మంచిగ ఇండ్లు కట్టించి ఇచ్చిండ్రు అని అందరూ చెప్పుకుంటుండ్రు. మా పిల్లలు, కుటుంబం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సార్లకు రుణపడి ఉంటాం.
– శారద, పిట్టలవాడ, రాఘవాపూర్
సంతోషంగా ఉంది…
మాకు ఇల్లు కట్టిస్తారని అనుకోలేదు. రోడ్డు పక్కన పండ్లు, కంకులు అమ్ముకొని బతికేటోళ్లం. మమ్ముల్ని ఎవరూ పట్టించుకుంటరు అని అనుకునేటోళ్లం. మా కష్టాలు అందరూ చూసి వెళ్లేవాళ్లు కానీ తెలంగాణ ప్రభుత్వం మా ఇబ్బందులు గుర్తించింది. గుడిసెలు వేసుకొని బతికినం. ఇప్పుడు మంచి ఇంట్లో ఉంటున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటాం.
– మౌనిక, పిట్టలవాడ, రాఘవాపూర్