
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 14 : పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒక్కసారైనా ‘చాయ్’ తాగనిదే చాలా మందికి రోజు గడిచినట్టు ఉండదు. రాష్ట్రం, దేశం.. ఇలాంటి హద్దులేవి లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ‘టీ’ ని ఇష్టపడతారు. స్నేహితులు కలిసినప్పుడు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, ఆఫీసుల్లో ఇలా ఏదో ఒక సందర్భంలో చాయ్ తాగుతుంటారు. అయితే, ఒకప్పుడు ఒకటి, రెండు రుచుల్లో మాత్రమే లభించినప్పటికీ మారుతున్న కాలానికనుగుణంగా ప్రస్తుతం ఎన్నో రకాల టీ పొడులు మార్కెట్లో లభిస్తున్నాయి. గల్లీ, గల్లీకో టీ స్టాల్ వెలిసిన నేపథ్యంలో వినియోగదారుల అభిరుచిని బట్టి పూదీనా, నిమ్మ, అల్లం, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఇలాచీ, బాదం వంటి రుచులను టీ వ్యాపారస్తులు తయారు చేస్తున్నారు. ఈ మధ్యనే పప్పు దినుసులతో తయారు చేసిన రాగి మాల్ట్ టీ అందుబాటులోకి వచ్చింది. రోజుకో కొత్త ఫ్లేవర్‌ను రుచి చూస్తూ టీ ప్రియులు సైతం ఆస్వాదిస్తున్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు అనేక చిన్న దుకాణాలు ఉండగా, కొన్ని చోట్ల హైటెక్ హంగులతో కార్పొరేట్ తరహాలో షాపులను ఏర్పాటు చేసి ప్రజలను ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. నేడు అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా చాయ్ ప్రాముఖ్యతపై కథనం.
జాతీయ పానీయం..
దేశంలో టీ తాగేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తాజా సర్వేల ప్రకారం దేశంలో ప్రతి మనిషి రోజుకు 100 మిల్లి లీటర్ల టీ దాగుతున్నట్లు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి తర్వా త ఎక్కవగా తాగే పానీయం తేనీరు మాత్ర మే. టీ మొక్కల ఆకుల్లో వేడి నీరు, పాలు పోసి తయారు చేసే పానీయమే టీ. మంచి వాసనతో, మంచి రం గు, మంచి రుచి ఉండే చాయ్ అందరి జీవితాల్లో అంతర్భాగమైపోయింది. అస్సాంలో మొట్ట మొద టి తేయాకు మొక్క నాటిన మణిరామ్ దివాన్ 212 జయంతిని పురస్కరించుకుని జాతీయ పానీయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
మెదక్ జిల్లా కేంద్రంలో…
జిల్లా కేంద్రం మెదక్‌లో ఎన్నో చాయ్ హోటళ్లు ఉన్నాయి. కానీ, బస్ డిపో, పాత బస్టాండ్, చిల్డ్రన్ పార్క్, రాందాస్ చౌరస్తా వద్ద చాయ్ హోటళ్లలో చాయ్ తాగేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతారు. ఎంత పని ఉన్నా, ఎక్కుడ ఉన్నా చాయ్ కోసం ఈ హోటళ్లకే వస్తుంటారు. దగ్గర పట్ల ఉన్న ప్రభుత్వం , ప్రైవేటు కార్యాలయాలకు వీటి నుంచే చాయ్, కాఫీ వెళ్తుంది. ధర తక్కువ నచ్చిన రుచులు అందుబాటులో ఉండడంతో వినియోగదారులతో ఈ దుకాణాలు నిత్యం కిటకిటలాడుతుంటాయి.
ఈ రోజే ఎందుకంటే…
పుట్టిన రోజు, పెండ్లి రోజు, మదర్స్‌డే, ఫాదర్స్‌డే తదితర రోజుల్లాగానే డిసెంబర్ 15న అంతర్జాతీయ టీ దినోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యంపై పలుమార్లు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించాయి. ఇందులో భారత్‌తో సహా పలు దేశాలు పాల్గొని టీ దినోత్సవం జరుపుకునేందుకు చొరవ చూపాయి. మొదటి అంతర్జాతీయ టీ దినోత్సవం 2005 డిసెంబర్ 15న న్యూ ఢిల్లీలో జరుగగా, రెండవ అంతర్జాతీయ టీ డే 2006లో శ్రీలంకలో జరిగింది. ఇలా క్రమక్రమంగా ప్రతి సంవత్సరం అన్ని దేశాల్లో టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
వివిధ రుచుల్లో అలరిస్తున్న‘టీ’లు
రాగి మాల్ట్ ‘టీ’ (9 రకాల పప్పు దినుసులతో)ఈ మధ్యే రాగి మాల్ట్ ‘టీ’ అందుబాటులోకి వచ్చింది. తొమ్మిది రకాల పప్పు దినుసులతో ఈ టీని తయారు చేస్తారు. ఇది సామాన్య ప్రజలకే కాకుండా షుగర్ ఉన్న వారికి సైతం ఆరోగ్యపరంగా మంచింది.
మసాల ‘టీ’
శీతాకాలంలో మసాలా టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. శరీరంలో యాక్టివ్నెస్ పెరుగుతుంది. దక్షిణాది రాష్ర్టాల్లో అల్లం, యాలకులతో మసాలా టీని తయారు చేస్తారు. తలనొప్పి ఉంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
అల్లం ‘టీ’
తుమ్ముల నుంచి ఉపశమనం పొందేందుకు అల్లం టీ చాలా పని చేస్తుంది. వాంతులు, విరేచనాల వాటి నుంచి త్వరితగతిన విశ్రాంతి లభిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.
30 సంవత్సరాలుగా..
మెదక్ పట్టణం అజంపురాకు చెందిన షామిమ్ 30 సంవత్సరాలకు పైగా మున్సిపల్ కార్యాలయం పక్కన ‘లాబేల’ చాయ్ హోటల్ నడుపుతున్నాడు. ఈ చాయ్ హోటల్ నిర్వహణతో కుంటుంబాన్ని పోషిస్తున్నాడు. హోటల్‌తో వచ్చే ఆదాయంతో అన్నదమ్ముళ్లు, చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. పాత బస్టాండ్ వద్ద షామిమ్ చాయ్ అంటే చాలామందికి ఇష్టం. 1988లో చాయ్ హోటల్‌ను ప్రారంభించాడు.
అన్ని రకాల చాయ్‌లు…
బస్టాండ్‌లో దిగిన ప్రయాణికులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా బస్ డిపో వద్ద ఉన్న సంతోశ్ శెట్టి చాయ్ తాగాల్సిందే. ఇక్కడ అన్ని రకాల చాయ్‌లు చేస్తారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన వాడు. 11 సంవత్సరాల నుంచి చాయ్ హోటల్ నడుపుతున్నాడు. చాయ్ నుంచి వచ్చే ఆదాయమే అతడికి జీవనోపాధి. చాయ్ చేయడానికి మరో ముగ్గురిని నియమించుకుని ఉపాధి కల్పిస్తున్నాడు. ప్రతి రోజు సుమారు 1500ల కప్పుల వరకు విక్రయిస్తుంటాడు.
25 సంవత్సరాలుగా…
చిల్డ్రన్ పార్క్ వద్ద నర్సింలు గత 25 సంవత్సరాలు చాయ్ హోటల్ నడిపించాడు. మూడు సంవత్సరాల క్రితం నర్సింలు గుండెపోటుతో మరణించడంతో అతడి కుమారుడు రాంగోపాల్ చాయ్ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజూ 500 కప్పులు అమ్ముతున్నాడు. ఇక్కడ ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు చాయ్ తాగడానికి ఆసక్తి చూపిస్తారు.