
మెదక్, డిసెంబర్ 13 : ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. మెదక్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మంగళవారం ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇం దుకోసం నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుం చి డాక్టర్ యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి తూర్పు నిర్మల, స్వతంత్ర అభ్యర్థిగా మట్టా మల్లారెడ్డి పోటీలో నిలిచారు.
1018మంది ఓటర్లు ఓటేశారు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1026 మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, 13 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నారు. ఇందులో ఈ నెల 10న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1018 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 448 మంది, మహిళలు 570మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓటు వేశారు. సిద్దిపేట, తూప్రాన్, జహీరాబాద్, నారాయణఖేడ్ పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది.
నాలుగు టేబుళ్లపై కౌంటింగ్..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1026 ఓట్లుండగా, అం దులో 1018 ఓట్లు పోలయ్యాయి. వీటి కౌం టింగ్ కోసం నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యాక, ముందుగా టేబుళ్లపైకి స్ట్రాంగ్‌రూంలో నుంచి బ్యాలెట్ బాక్సులను తెచ్చి బ్యాలెట్ పత్రాలన్నింటినీ ఒక బండిల్‌గా ఏర్పాటు చేస్తారు. ఇలా నాలుగు టేబుళ్లపై బండిల్స్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇది పూర్తయ్యాక మొత్తం ఓట్లను నాలు గు టేబుళ్లకు సమానంగా పంచుతారు. అయితే పోలింగ్ సరళిని బట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డి గెలుపొందవచ్చని అంచనా.
అంచనాలకు మించి టీఆర్ఎస్కు ఓట్లు..
ఎమ్మెలీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అంచనాలకు మించి ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్కు 770 ఓట్లు ఉండగా, ఇంకా అంతకంటే ఎక్కువగానే ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి నామినేషన్ వేసిన నాటి నుంచి, ఉమ్మడి జిల్లాలోని నియోజవకర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించి, పోలింగ్ రోజున నేరుగా కేంద్రానికి తీసుకొచ్చారు. టీఆర్ఎస్కు చెందిన వారే కాకుండా ఇతర పార్టీలకు చెందిన వారు కూడా టీఆర్ఎస్కు ఓటు వేసి ఉంటారనే ఆశాభావాన్ని ఆ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్య క్రమంలో ఓటర్లు ఓట్లు వేస్తారు. ఇందులో చెల్లుబాటయ్యే ఓట్లను పరిగణలోకి తీసుకొని, మొదటి ప్రాధాన్య ఓట్లు 50 శాతానికి మించితే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధా న్య ఓట్లు 50శాతానికి తక్కువగా ఉంటే రెండో ప్రాధాన్య ఓట్లను కౌంటింగ్ చేస్తారు. ఉమ్మడి జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాల్లో 1018 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 777 ఓట్లు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండడంతో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డి విజయం ఖాయమని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.