
మెదక్, జనవరి 29 : కరోనా అంటే సొంతవాళ్లే ఆమడదూరం పారిపోతున్న ఈ రోజుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. పాజిటివ్ రోగులకు సైతం వైద్య సేవలు అందిస్తూ తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణుల్లో ఎవరికైనా పాజిటివ్ అని తెలిసినా ధైర్యంగా వాళ్లకు పురుడు పోసి తల్లీ బిడ్డల ప్రాణాలు నిలబెడుతున్నారు. మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో వైద్యులు జనవరి నెలలో 17 మంది కరోనా సోకిన గర్భిణులకు ప్రసవాలు చేసి పడ్డంటి బిడ్డలను ప్రసాదించి అందరి మన్ననలు పొందారు.
జిల్లా దవాఖానలో ప్రత్యేక ఏర్పాట్లు..
మెదక్ జిల్లాలోని 21 మండలాలతో పాటు పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలోని లింగంపేట, పొల్కంపేట, నాగిరెడ్డిపేటతో పాటు వివిధ మండలాలకు చెందిన చాలామంది రోగులు వైద్యం కోసం జిల్లా కేంద్ర దవాఖానకు వస్తుంటారు. అయితే, కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో గర్భిణులకు కరోనా సోకితే చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా కేంద్ర దవాఖానలో చేశారు. ఎవరికైనా పాజిటివ్ అని తేలితే వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతేకాకుండా, గర్భిణుల కోసం ప్రత్యేకంగా వార్డులను అందుబాటులో ఉంచారు. సెకండ్ వేవ్‌లో కూడా దవా ఖానలో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించి వందలాది మంది ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం థర్డ్‌వేవ్ విజృం భిస్తున్న నేపథ్యంలో జిల్లా దవాఖానలో కరోనా సోకిన గర్భిణులకు ప్రసవాలు చేస్తూ తల్లీ శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
30 పడకలతో ప్రత్యేక వార్డు..
జిల్లా దవాఖానలో కరోనా బాధిత గర్భిణుల కోసం 30 పకడలను సిద్ధంగా ఉంచారు. జనవరిలో 17 మంది కరోనా సోకిన గర్భిణులకు విజయవంతంగా ప్రసవాలు చేశారు. ప్రసవాల అనంతరం దవాఖాన ఆవరణ అంతటినీ శానిటైజేషన్ చేస్తున్నారు. అవసరమైతే రోగిని ఐసొలేషన్ వార్డులో ఉంచుతున్నారు.
మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ..
జిల్లా కేంద్ర దవాఖానకి వచ్చే గర్భిణులకు కరోనా పరీక్షలు చేయాలని, ఎవరికైనా కరోనా నిర్ధారణ అయితే వెంటనే వారికి ప్రత్యేకంగా వైద్యం అందించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఈ నెల మొదటి వారంలో డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌వోలు, వైద్యాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. దీంతో, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కరోనా సోకిన గర్భిణుల ప్రసవాల కోసం దవాఖానలో వెంటనే ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్‌కు సూచించారు. మంత్రి, ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు దవాఖానలో ప్రత్యేకంగా 30 పడకలను అందుబాటులోకి తెచ్చారు. కాగా, ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 17 కరోనా బాధిత గర్భిణులకు ప్రసవాలు చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండెంట్ తెలిపారు.
గర్భిణులు భయపడాల్సిన పనిలేదు..
కరోనా సోకిన గర్భిణులు భయపడాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్ర దవాఖానలో ప్రత్యేకంగా 30 పడకలను సిద్ధం చేశాం. జనవరి నెలలో కరోనా సోకిన 17 మందికి సుఖ ప్రసవాలు చేశాం. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కొందరు ఐసొలేషన్ వార్డులో ఉండగా, మరికొందరు డిశ్చార్జి అయి క్షేమంగా ఇంటికి వెళ్లారు.