
సిద్దిపేట, సెప్టెంబర్ 06 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సంస్థాగత ఎన్నికల్లో జోరు మీదున్నది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతున్నది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ అధ్యక్ష పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. ఈనెల 2న అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించిన పార్టీ శ్రేణులు.. ఎంతో ఉత్సాహంగా జెండా పండుగలో పాల్గొని విజయవంతం చేశారు. మరుసటి రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల నేతృత్వంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికలతోపాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 12 లోగా అన్ని గ్రామాల్లో పార్టీ కమిటీ ఎన్నికలను పూర్తి చేసే లక్ష్యంగా నాయకులు పనిచేస్తున్నారు.
ఉద్యమ పార్టీ కావడంతో పోటాపోటీ..
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల ఏర్పాటుతో సరికొత్త నిర్మాణాన్ని టీఆర్ఎస్ చేపడుతున్నది. తద్వారా అనేక మందికి కొత్తగా పార్టీ పదవులు దక్కుతున్నాయి. అధికార పార్టీ కావడం, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎదురులేని శక్తిగా నిలవడంతో టీఆర్ఎస్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది.
ఎదురులేని శక్తిగా..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ బలంగా ఉంది. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 శాసనసభ స్థానాలకుగాను 8 స్థానాల్లో టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారు. మూ డు జిల్లా పరిషత్ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. వీటికి తోడు మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. మున్సిపల్ చైర్మన్లు ఇలా అన్నింటా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండడం, ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు ఎదురులేకుండా ఉంది. ప్రతిపక్ష పార్టీలు జిల్లాలో నామమాత్రమే అని చెప్పాలి. అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్కు బలమైన క్యాడర్ ఉంది. అందుకే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికల్లో టీఆర్ఎస్లో పోటాపోటీ వాతావరణం నెలకొంది. గతంలో పార్టీ సభ్యత్వ నమోదుకు టీఆర్ఎస్ అధిష్టానం సిద్దిపేట జిల్లాకు మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, మెదక్ జిల్లాకు వేలేటి రాధాకృష్ణశర్మ, సంగారెడ్డి జిల్లాకు బక్కి వెంకటయ్య ఇన్చార్జిలుగా నియమించింది. వారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమైంది.
కమిటీల్లో అన్నివర్గాలకు అవకాశం..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు చాలా గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తి చేశారు. ఈనెల 12లోగా అన్ని గ్రామాల్లో గ్రామ, వార్డు కమిటీలతోపాటు అనుబంధ కమిటీల ఎన్నికలను పూర్తి చేసే లక్ష్యంగా టీఆర్ఎస్ నాయకత్వం పని చేస్తున్నది. ప్రతి గ్రామ కమిటీలో 11 మంది సభ్యులకు చోటు కల్పిస్తున్నారు. పెద్ద గ్రామాలు, ఇతర చోట్ల ఆ సంఖ్య ను 25 మంది వరకు పెంచుతున్నారు. గ్రామ కమిటీలో క్రియాశీల సభ్యులను మాత్రమే తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 51 శాతం కేటాయిస్తూ గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీ, బీసీ, యువత, రైతు, మహిళా, సోషల్ మీడియా అనుబంధ కమిటీలు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అనుబంధ కమిటీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ప్రచార కార్యదర్శితోపాటు ముగ్గురు కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఆయా గ్రామాల్లో ఎస్టీ, మైనార్టీలు ఉంటేనే అక్కడ ఆ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. నూతన కమిటీల కార్యవర్గం ఉత్సాహంగా టీఆర్ఎస్ పటిష్టానికి కృషి చేయడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను గడప గడపకూ తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నాయి. గ్రామ కమిటీల ఎన్నికలను ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఇన్చార్జిలు పర్యవేక్షిస్తున్నారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలపై మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ఉమ్మడి జిల్లా నాయకత్వంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.