తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో విద్యాబోధన
పాఠశాలలో 465 మంది విద్యార్థులు
ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం
విద్యావలంటీర్‌కు రూ. 3500 అందజేస్తున్న జడ్పీటీసీ
శివ్వంపేట, ఫిబ్రవరి 24: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో సర్కారు బడుల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. శివ్వంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు 2015 నుంచే తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను కొనసాగిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు వేర్వేరు గదుల్లో విద్యను బోధిస్తున్నారు.
మొత్తం విద్యార్థులు 465 మంది
జడ్పీహెచ్ఎస్లో ప్రస్తుతం 6వ తరగతిలో 83మంది, 7వ తరగతిలో 93 మంది, 8వ తరగతిలో 106 మంది, 9వ తరగతిలో 102 మంది, 10వ తరగతిలో 81 మంది, మొత్తం పాఠశాలలో 465 మంది విద్యార్థులున్నారు. ఇందులో 276 మంది ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో సర్కారు బడులవైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గతం కంటే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది.
అన్ని ఉచితంగా ఇస్తున్నారు..
శివ్వంపేట జడ్పీహెచ్ఎస్లో ఇంగ్లిష్ మీడియంలో 10వ తరగతి చదువుతున్నా. ఉపాధ్యాయులు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. మా స్కూల్లో విద్యతోపాటు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూని ఫాంలు అన్ని ఉచితంగా ఇస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పించడం సంతోషంగా ఉంది. – శ్రీవల్లి, విద్యార్థిని, 10వ తరగతి
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
మన ఊరు మనబడి కార్యక్రమంతో పేద విద్యార్థుల తలరాతలు మార్చే మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మండలంలోని పిల్లుట్ల ప్రాథమిక పాఠశాలలో విద్యా వలంటీర్‌ను నియమించి, ప్రతినెలా రూ.3500 అందజేస్తున్నాం. శివ్వంపేట జడ్పీహెచ్ఎస్కు సొంత ఖర్చులతో బోరు, పాఠశాలకు పెయింటింగ్ వేయించాం. – పబ్బ మహేశ్‌గుప్తా, జడ్పీటీసీ