ఆత్మగౌరవం.. అస్తిత్వానికి ప్రతీక కవులు, రచయితలు, కళాకారుల మనోగతం ‘నాయకత్వ లక్షణాలున్న సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం.. సామాన్యుల నుంచి అసామ్యానుల వరకు మెప్పించే సత్తా ఆయనకు సొంతం.. నాడు ఉద్యమ సమయంలో ఆయన పిలుపు మేరకు ధూంధాం నిర్వహించాం.. ప్రజల్లో చైతన్యం నింపాం.. తెలంగాణ వచ్చినాక మాకు గౌరవం దక్కింది.. కవులు, కళాకారులకు సముచిత స్థానం లభించింది.. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుకోవడం చాలా సంతోషం. అలాంటి కేసీఆర్ సార్ దేశానికి ప్రధాని కావాలి.. తెలంగాణ కోసం చావును కూడా లెక్క చేయలేదు.. తెలంగాణను ఎట్లా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారో, దేశాన్ని కూడా అలానే అన్ని రంగాల్లో ముందుంచుతారు’.. అని కవులు, రచయితలు, కళాకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– సిద్దిపేట, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఉంటేనే ప్రజలు ధైర్యంగా, సంతోషంగా ఉంటారు. నిత్యం ప్రజా సంక్షేమం, శ్రేయస్సు కోసం పరితపిస్తూ.. ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేసే నాయకుడితోనే భారతదేశంలో గొప్ప మార్పు వస్తుంది’ అని కవులు, రచయితలు, కళాకారులు అభిప్రాయపడుతున్నారు. పోరాడి సాధించిన తెలంగాణను ఎనిమిదేళ్లలోనే ప్రగతిపథంలో నడిపించి తన మార్క్ పాలన చూపించారని ఇప్పుడు ఇదే స్ఫూర్తితో దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తారని ధీమాగా చెబుతున్నారు. ఉద్యమనేత, ముఖ్యమంత్రిగా అన్నిఅంశాలపై తనకున్న అవగాహన, అనుభవంతో భారత్ సరికొత్తగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. ఉద్యమం ద్వారా ఆత్మగౌరవాన్ని.. అస్తిత్వాన్ని.. ఆరాటాన్ని.. ఉనికిని.. ఈ భూగోళానికి తెలియజేయడంలో కేసీఆర్‌ది ఒక చరిత్ర అని పేర్కొంటున్నారు. భావి రాజకీయాలు ఎలా ఉన్నా, కేసీఆర్ ఉన్న చోటు నుంచి ఉన్నతానికి మహాప్రస్థానానికి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం ఆహ్వానించదగ్గ విషయమంటున్నారు.
అన్ని విధాలా బాగుపడుతుంది..
అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి, తెలంగాణను ప్రగతిబాటలో పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్‌తోనే దేశం అన్ని విధాలా బాగుపడుతుంది. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేస్తూ, కార్పొరేట్‌కు వంత పాడుతున్న బీజేపీని గద్దె దింపి.. దేశంలో సరికొత్త పాలన అందించడం కేసీఆర్‌కే సాధ్యం’ అని స్పష్టం చేస్తున్నారు. ఎంతటి సమస్యనైనా పరిష్కరించగల నేర్పు, దేనినైనా ఎదిరించి పోరాడే నాయకుడు కేసీఆర్‌తో ఏదైనా సాధ్యమవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకున్న అపార అనుభవం, పరిజ్ఞానంతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో పాటు ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తూ ఆసరా అవుతున్నట్టే ఇతర రాష్ర్టాల ప్రజలకు అందించే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని చెబుతున్నారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని.. అప్పుడు దేశం ప్రగతి సాధిస్తుందంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కేసీఆర్ ప్రధాని అయితే అభివృద్ధి పరుగులు
నాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకు ధూంధాంలో పాల్గొని ప్రజల్లో చైతన్యం కల్పించాం. నేడు అదే ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గడపగడపకూ చేరుతున్నాయి. కేసీఆర్ సార్ ప్రధాని కావాలి. తెలంగాణ కోసంచావును కూడా లెక్కచేయని నాయకుడు తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేస్తుండో మనకండ్ల ముందుకనిపిస్తున్నది.కేసీఆర్ ప్రధాని అయితే దేశాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తాడు. నిజంగా తెలంగాణ అభిమాన నాయకుడు ప్రధాని అయితే మనకు అంతకుమించి సంతోషం ఉండదు.
-పిన్నింటి రత్నం, కళాకారుడు, ఐనాపూర్
సీఎం కేసీఆర్ దేశ్‌కీ నేత కావాలి..
సీఎం కేసీఆర్ దేశ్‌కీ నేత కావాలి. దేశంలో ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోతున్నారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో సీఎం కేసీఆర్ అయితేనే దేశంలో ప్రజలకు అనుకూలమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టగల సమర్ధుడు. దేశంలోని రాష్ర్టాలను ఏకతాటిపై తీసుకువచ్చి సుపరిపాలన అందించేనేత ప్రస్తుత కాలంలో కనిపించేది కేవలం సీఎం కేసీఆరే. రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు దేశాన్ని కూడా ఆదర్శంగా మారుస్తాడన్న నమ్మకం ఉంది.
– రాళ్లబండి వీరాచారి, రచయిత, కానుకుంట, గుమ్మడిదల మండలం
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
నాయకత్వ లక్షణాలు ఉన్న సీఎం కేసీఆర్ దేశానికి అవసరం ఎంతైనా ఉన్నది. సామాన్య నుంచి అసామాన్యుల వరకు మెప్పించగల సత్తా ఉన్న నేత కేసీఆర్ మాత్రమే. దేశంలో కొత్త రాజకీయపార్టీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమైన పార్టీలు ప్రజలకు మేలు చేసే విషయాన్ని విస్మరించాయి. తెలంగాణ సృష్టికర్త సీఎం కేసీఆర్ వైపు దేశం చూస్తున్నది. బలమైన నాయకుడు కేసీఆర్‌తోనే దేశానికి మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నా.
-నాదమునుల రామారావు, కవి, రచయిత, హుస్నాబాద్‌టౌన్
జాతీయ పార్టీలకు వణుకు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే జాతీయ పార్టీలకు వణుకుపుడ్తది. దేశంలోని సబ్బండ వర్ణాలకు సముచిత స్థానం కలుగుతది. కేసీఆర్ సార్ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దినట్లే దేశాన్ని కూడా భవిష్యత్‌లో అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచుతారు. రాజకీయంగా శక్తిసామర్థ్యాలు కలిగిన నేత కేసీఆర్. కేసీఆర్ పాలన నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో కేసీఆర్ దేశ పాలన చేపడితే ప్రపంచంలో భారతదేశాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉన్నది. భావితరాలకు స్ఫూర్తిదాయకమైన పాలన అందించే దేశ నేతగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
-తాడూరి సురేశ్, కళాకారుడు, గౌరవెల్లి, అక్కన్నపేట
బీజేపీని ఎదుర్కొనే సత్తా గల నేత కేసీఆర్
బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడింది. ప్రస్తుతం దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నది. ఇలాంటి సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయం సీఎం కేసీఆర్ మాత్రమే. అన్నివర్గాలు సంతోషంగా ఉండాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం. సీఎం కేసీఆర్ రాజకీయ దక్షత గల నేత. ప్రజల అభ్యున్నతి కోరే నాయకుడుంటేనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నది. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగమించింది. ఇదే తరహా పాలన దేశ ప్రజలు కోరుకుంటున్నారు.అన్ని రంగాల పై అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఆయకు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోని పథకాలన్నీ దేశమంతటా అమలవుతాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజందరికీ మేలు జరుగుతది. రైతుల గురించి ఆలోచన చేసి ఎన్నో పథకాలు తెచ్చిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడితే మహర్దశ వచ్చినట్లే.
– ఎర్రగుంట సుజాతప్రసాద్,కవయిత్రి, లచ్చపేట (దుబ్బాక)
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. విపక్షాల మద్దతు తీసుకొని దేశాభివృద్ధికి పాటు పడాలి. దేశ స్థాయిలో రైత బంధు, రైతు బీమా పథకాలు అమలు చేయా లి. రైతులకు సాగు నీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందివ్వాలి. రాష్ట్రంలో మాదిరిగా దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలి. దేశాన్ని అన్ని రంగాల్లోఅభివృద్ధిచేయాలి. ప్రజ లు హర్షిస్తారు.
-అనంతవరం మాణిక్యలింగం, కవి, గుండారెడ్డిపల్లి
సీఎం కేసీఆర్‌తోనే దేశం సుభిక్షం
ఉద్యమ బిడ్డ సీఎం కేసీఆర్‌తోనే దేశం సుభిక్షంగా ఉంటది. తెలంగాణను దేశంలోనే నంబర్ స్థానంలో నిలిపారు. ప్రాణాలకు తెగించి రాష్ర్టాన్ని సాధించిన ఆయన దేశాన్ని నడిపించే సత్తా ఉన్నది. దేశానికి సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడి అవసరం వచ్చింది. తెలంగాణ సంక్షేమ పథకాలను దేశ వాప్తంగా అమలు చేసే దమ్మున నాయకుడు కేసీఆర్. దేశానికి నాయకత్వం వహిస్తే దేశం అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండడ ఖాయం. దేశాన్ని సుభిక్షంగా మార్చే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఉన్నది .ఉజ్వల భారత్ కోసం ఉద్యమ నేత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావడం శుభపరిణామం.
-ఎన్నవెళ్లి రాజమౌళి,కవి , సిద్దిపేట