వట్పల్లి, మే 18: అధికారం ఉందనే ధీమా… అధికారులు తాము చెప్పినట్లు వింటారనే నమ్మకం… మంత్రి నియోజకవర్గం ఇంకేముంది. గల్లీ లీడర్ మొదలుకొని మండల స్థాయి లీడర్ వరకు తామే మంత్రి అనే లెవల్లో అధికారులను నయానో భయానో మచ్చిక చేసుకుని నిబంధనలకు విరుద్ధ్దంగా అడ్డగోలుగా సింగూరు బ్యాక్‌వాటర్ స్థలాల్లో, వ్యవసాయ, ప్రభుత్వ భూముల్లో చేపల చెరువులు ఏర్పాటు చేయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని ఖాదీరాబాద్, దేవునూర్, పాలడుగు, భూత్కుర్, గొర్రెకల్, దరఖాస్తుపల్లి, ఉసిరికపల్లి, నిర్జప్ల గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఇష్టారాజ్యంగా చేపల చెరువులు ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు.
అక్రమ చేపల చెరువుల దందా మూడు పూలు.. ఆరు కాయలుగా సాగుతున్నది. వట్పల్లి మండలంలో సుమా రు 100 ఎకరాలకు పైనే అధికారుల అనుమతి లేకుండా చేపల చెరువులు ఏర్పాటు చేశారు. సింగూరు బ్యాక్‌వాటర్ పక్కన ఉన్న ముంపు భూములు తమవేనంటూ పరిహారం పొందిన రైతులు చేపల పెంపకందారులకు లీజుకు ఇస్తున్నారు. గతంలో సింగూరు, మంజీరా డ్యామ్‌ల నిర్మాణంలో ముంపునకు గురైన భూములకు సంబంధించి ప్రభుత్వం అప్పట్లో బాధిత రైతులకు పరిహారం ఇచ్చింది.
అయినా ఆ రైతుల ఏటా రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు డబ్బులు తీసుకుని చేపల చెరువుల ఏర్పాటుకు ముంపు భూములిస్తున్నారు. చేపల చెరువుల పెంపకందారులు మంజీరా నది నుంచి కాలువలు ఏర్పాటు చేసుకొని మోటర్ల సహాయంతో చేపల చెరువులను నీటితో నింపుతున్నారు. చేపల పెంపకం సులువుగా ఉండడంతో పాటు తక్కువ సమయంలో చేప పిల్లల ఎదుగుదల, అధిక లాభాలు ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు ఇక్కడ చేపల చెరువుల నిర్మాణం చేపడుతున్నారు.
బాయిలర్ కోళ్ల వ్యర్థాలే ఆహారం..
తక్కువ పెట్టుబడితో వచ్చే బ్రాయిలర్ కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా పెడుతున్నారు. బాయిలర్ కోళ్ల వ్యర్థాలు చేపలకు అందించడం కోసం వాహనాల్లో తరలించే సమయంలో గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే రైతులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటాంటి సంఘటనలు సంబంధిత అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. పాడైన, కుళ్లిన కోళ్ల వ్యర్థాలు ఆహారంగా పెడుతూ చేపలను పెంచుతున్నారు. ఇలా పెరిగిన చేపలు తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయినా వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం విశేషం. చేపల చెరువులోకి కావాల్సిన నీటికోసం మంజీరా డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి కాలువలు ఏర్పాటు చేసి, చెరువు వద్దకు నీటిని తెచ్చి పెద్ద పెద్ద మోటర్లతో నీటితో నింపుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్ అధికారులు చేపల చెరువుల మోటర్లకు ఏకంగా విద్యుత్ సరఫరా చేసి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వ అధికారులే అక్రమ దందాలకు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
చేపల చెరువులన్నీ సింగూరు బ్యాక్‌వాటర్ సమీపంలో ఏర్పాటు చేయడంతో మూగ జీవాలకు నీటి కొరత ఏర్పడుతున్నది. మిషన్ భగీరథ గ్రిడ్‌కు సమీపంలోనే చేపల చెరువులు ఏర్పాటు చేశారు. ప్రజలకు అందించే మిషన్ భగీరథ తాగునీరు కలుషితమై అనారోగ్యాల బారినపడే అవకాశం ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అక్రమంగా ఏర్పాటు చేసిన చేపల చెరువులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.