మహబూబ్‌నగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకున్న ద్వితీయశ్రేణి నేతల ఆశలపై జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఇద్దరు మంత్రులు, 11 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇలాకాల్లో రిజర్వేషన్లు గందరగోళానికి దారితీశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుచరులుగా చలామణి అవుతున్న కొంతమంది నేతలు రిజర్వేషన్లతో డీలాపడ్డారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రమవుతుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో పో టీ చేసేందుకు అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు.
సీఎం సొంత జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లా హెడ్‌క్వార్టర్లపై గులాబీ జెండా ఎగురవేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రధాన జెడ్పీ పీఠాల రిజర్వేషన్లు మొత్తం మహిళలకే కేటాయించగా, ఒక్క జోగుళాంబ గద్వాల మినహా మిగతా అన్ని కూడా మహిళలకు రిజర్వ్ చేశారు. నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించగా, వనపర్తి , మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ బీసీ మహిళకు.. జోగుళాంబ గద్వాల షెడ్యూల్ కులాలు కేటగిరిలో మహిళ/పురుషుడికి కేటాయించారు.
నారాయణపేట జెడ్పీపీఠం రేసులో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సతీమణి చిట్టెం సుచరిత పోటీకి దిగనుండడంతో అక్కడ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ఇటు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్ యా దవ్, పట్నం నరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, గద్వాల బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నా యుడు పార్టీని గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్నారు.
స్థానిక సంస్థలు జరుగుతాయో లేదో అన్న ప్రచారం కూడా గ్రామాల్లో కొనసాగుతున్నది. ఒకవేళ ఎన్నికలు జరిగితే అభ్యర్థులు ఎవరెవరు అనే విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మొత్తంపై ఉమ్మడి జిల్లాలో జెడ్పీ పీఠంపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్న చాలామంది నేతలు రిజర్వేషన్లతో కంగుతిన్నట్లు కనిపిస్తోంది. మొత్తం ఐదు జెడ్పీ లో నాలుగు ప్రధాన జిల్లాల జెడ్పీ స్థానాలు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. ఈసారి ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థల్లో పోటాపోటీగా జరిగే అవకాశం లేకపోలేదు.
రిజర్వేషన్లతో రాజకీయ భవిష్యత్ తారుమారు..
ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతలను తమ భుజస్కంధాలపై వేసుకొని గెలిపించిన నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశపడ్డారు. తీరా రిజర్వేషన్లు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జె డ్పీ చైర్మన్ స్థానాలను ఎమ్మెల్యేలు తమ అనుచరులకు కట్టబెట్టాలని ముందస్తుగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా వాళ్లకు భరోసా ఇవ్వడంతో నేతలంతా ఆశల పల్లకీలో ఊరేగారు. జనరల్ అవుతాయని కొందరు.. తమకే అవకాశం వస్తుందని మరికొందరు ఆశలు పెట్టుకున్నా రు.
తీరా అధికారులు రిజర్వేషన్లు ప్రకటించడంతో డీలా పడిపోయారు. లో లోపల అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు పెద్ద తలనొప్పులు తగ్గిపోయాయని సంబురపడిపోతున్నారు. ప్రొటోకాల్ ప్రకారం కూడా నియోజకవర్గాలు, జిల్లాలో ఎంపీల తర్వాత స్థానం జెడ్పీ చైర్మన్లదే.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలను కూడా బైపాస్ చేస్తూ వెళ్లే పరిస్థితి. దీనివల్ల రాజకీయ ప్రత్యర్థులుగా తమకు ఎక్కడ మారిపోతారని భయపడిన నేతలకు రిజర్వేషన్లు కూడా కలిసి వచ్చాయి. దీంతో ద్వితీయ శ్రేణి నేతల చాలామంది జెడ్పీ పదవులపై ఆశలు వదులుకున్నారు. మొత్తం మూడు జెడ్పీ లు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బీసీ నేతల హవా మొదలైంది. అయితే అభ్యర్థులు ఎవరనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.
పోటీకి భయపడుతున్న కాంగ్రెస్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇద్దరు మంత్రులు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నది. దీంతో చాలామంది నేతలు కాంగ్రె స్ నుంచి పోటీ చేయడానికి జంకుతున్నారు.
దీనికి తోడు రిజర్వేషన్లు బలమైన నేతలు ఉన్న దాంట్లో రాకపోవడంతో వాళ్లంతా కిందిస్థాయి నేతలకు మద్దతు పలకాల్సి వస్తుందని మదన పడుతున్నారు. ఇక మంత్రుల ఇలాకాల్లో కూడా రిజర్వేషన్లు కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారాయి.
బీఆర్ఎస్లో ఫుల్ జోష్..
పాలమూరు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నేతలంతా
ఒక్కతాటిపైకి రావడంతో ఫుల్‌జోష్ కనిపిస్తోంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా అన్ని మండలాల్లో జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి సై అంటున్నారు. ఇప్పటికే జెడ్పీ చైర్పర్సన్ పదవి తమకు ఇస్తే జెడ్పీటీసీలను గెలిపించే బాధ్యతను కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మిగతా పార్టీలకంటే ముందే బీఆర్ఎస్ స్థానిక సంస్థలు ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంది. మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థలు ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకొని ముందుకు సాగుతున్నారు. చాలా మండలాల్లో రిజర్వేషన్లు ఎలా ఉన్నా పోటీచేసే అభ్యర్థుల సంఖ్య విపరీతంగా ఉంది.
మండల స్థాయి సమావేశాల్లో కూడా చాలామంది నేతలు హాజరై తమకు టికెట్ కావాలని పోటీ పడుతున్నారు. ఇక జంప్ జిలానీలు కూడా పార్టీలు మారుతున్నారు. అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా తిరిగి గులాబీ గూటికి క్యూ కడుతున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ నిధులు లేకపోవడం.. పనులు జరగకపోవడంతో.. పైగా ప్రజా వ్యతిరేకత స్థానిక నేతలను సతమతం చేస్తోంది. అంతేకాకుండా పార్టీ సింబల్ పై జరిగే ఎన్నికలు కావడంతో గులాబీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.
గద్వాలలో చల్లా మార్క్ రాజకీయం
గద్వాల జెడ్పీ చైర్మన్ పదవి షెడ్యూల్ కులాలకు రిజర్వ్ అయ్యింది. ఈ జిల్లాలో మొత్తం 13 జెడ్పీటీసీలకు గానూ అలంపూర్ నియో జకవర్గంలో 8 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. గద్వాలలో ఐదు జెడ్పీటీసీలు స్థానాలు ఉండగా.. జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్‌కు అను గుణంగా అలంపూర్‌లో మూడు జెడ్పీటీసీ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి 2023 ఎన్నికల్లో తన అభ్యర్థిని అసె ంబ్లీకి నిలబెట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఈసారి కూడా జెడ్పీ చైర్మన్ పదవితోపాటు మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారు.
కాగా కాంగ్రె స్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు గద్వాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. అయి తే మాజీ ఎమ్మెల్యే సంపత్ తన భార్యకు లేదా కొడుకుకు జెడ్పీ చైర్మన్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే గద్వాల నియోజక వర్గంలోని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇటు సరితవర్గం సపోర్ట్ చేయక పోవచ్చు. మరోవైపు సొంత ఇలాకాలో ఎమ్మెల్సీ చల్లా వెంక ట్రామి రెడ్డితో ఢీకొనే స్థాయి ఆయనకు లేదు. దీంతో బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓట్లు కూడా కారు పార్టీ వైపే ఉన్నాయి.
పేట జెడ్పీ చైర్పర్సన్ రేసులో సుచరిత
సీఎం సొంత నియోజకవర్గం ఉన్న నారాయణపేట జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ జిల్లాలో 13 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా మక్తల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇటు మక్తల్ అటు నారాయణపేట నియోజకవర్గంలో మెజారిటీ జెడ్పీటీసీలను గెలిపించుకునేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలు పక్కా స్కెచ్ వేస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ రేసులో సుచరిత ఉంటే మరోవైపు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, ఎంపీ డీకే అరుణకు పెద్ద సవాలుగా మారనున్నది.
మీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ పదవికి సుచరితకు లైన్ క్లియర్ కావడంతో కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. ఇటు ధన్వాడ నుంచి కానీ అటు కృష్ణా నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా మండలాలకు చెందిన నేతలు కూడా పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నారు. మొత్తం పైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ పదవులు కొంతమందికి నిరాశ కలిగిస్తే మరికొంతమందికి ఆశాజనకంగా మారాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.